బెట్టింగ్ కు బానిసై ఒకరు.. విలాసవంతమైన జీవితం కోసం మరొకరు.. చోరీలకు పాల్పడిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు

బెట్టింగ్ కు బానిసై ఒకరు.. విలాసవంతమైన జీవితం కోసం మరొకరు.. చోరీలకు పాల్పడిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు

షేర్ మార్కెట్ లో నష్టాలు, ఆన్ లైన్ బెట్టింగ్ కు బానిసై ఒకరు.. విలాసవంతమైన జీవితం కోసం సులభంగా డబ్బు సంపాదించాలనే చెడుబుద్దితో మరొకరు.. ఇద్దరు మాజీ సైనిక ఉద్యోగులకు చోరీలకు పాల్పడిన ఘటనలు వెలుగు చూశాయి.భారత సైన్యంలో 30 ఏండ్ల పాటు సుబేదార్​గా సేవలందించి రిటైర్డ్​ అయిన ఓ మాజీ సైనికుడు దురలవాట్ల కారణంగా దొంగగా మారాడు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన అన్నపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి (51) ,  తెలం గాణలోని బెల్లంపల్లికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి నరేంద్రుల శ్రీకాంత్ లను చోరీ కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. 

పద్మారావునగర్, వెలుగు: భారత సైన్యంలో 30 ఏండ్ల పాటు సుబేదార్​గా సేవలందించి రిటైర్డ్​ అయిన ఓ మాజీ సైనికుడు దురలవాట్ల కారణంగా దొంగగా మారాడు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన అన్నపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి (51) ఆర్మీ నుంచి 2024లో పదవీ విరమణ పొంది ప్రస్తుతం మేడ్చల్ జిల్లా నాగారంలో నివసిస్తున్నాడు. షేర్ మార్కెట్​లో నష్టపోవడం, ఆన్​లైన్ బెట్టింగ్​లకు బానిస కావడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఈ క్రమంలో నేరాల బాట పట్టాడు. 

ఈ నెల 2న కాకతీయ ఎక్స్​ప్రెస్​లో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలి గొలుసు లాగడానికి ప్రయత్నించగా, ఆమె గట్టిగా పట్టుకోవడంతో గొలుసు తెగి సగం భాగం(15 గ్రాములు) శ్రీనివాస్ రెడ్డి చేతికి చిక్కింది. వెంటనే లాలాగూడ స్టీల్ బ్రిడ్జి వద్ద నెమ్మదిగా వెళ్తున్న రైలు నుంచి దూకి తప్పించుకున్నాడు. మరుసటి రోజు మళ్లీ అదే కాకతీయ ఎక్స్​ప్రెస్​లో మరో మహిళా ప్రయాణికురాలి బంగారు గొలుసును తెంచుకుని చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుంచి దూకేశాడు. 

గురువారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లోని 4వ నంబర్ ప్లాట్​ఫామ్​పై అనుమానాస్పదంగా తిరుగుతున్న శ్రీనివాస్ రెడ్డిని సికింద్రాబాద్ రైల్వే పోలీస్(జీఆర్పీ), ఆర్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చేసిన నేరాలను అంగీకరించడంతో అతని నుంచి రూ. 7.50 లక్షల విలువైన 50 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా పట్టుకున్న ఇన్​స్పెక్టర్ బి.సాయిఈశ్వర్ గౌడ్, ఎస్సైలు సుబ్బారెడ్డి, మాధవ్, ఆర్పీఎఫ్ బృందాన్ని రైల్వే ఎస్పీ సందీప్ అభినందించగా, ఐజీ రమేశ్ నాయుడు రివార్డులు ప్రకటించారు.

డాక్టర్​ ఇంట్లో చోరీ..ఆర్మీ రిటైర్డ్​ ఉద్యోగి పనే.. 

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేటలో సంచలనం సృష్టించిన డాక్టర్ ఇంట్లో దోపిడీ కేసును పోలీసులు 72 గంటల్లో ఛేదించారు. ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి సుమారు రూ.20 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గురువారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ ఎస్.రష్మీ పెరుమాళ్ కేసు వివరాలను వెల్లడించారు. రామగుండం ఐవోసీలో భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్న బెల్లంపల్లికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి నరేంద్రుల శ్రీకాంత్ విలాసవంతమైన జీవితం కోసం సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దోపిడీకి పథకం రచించాడు. 

తన స్నేహితులు రాజేశ్, శ్యామ్, చంద్రశేఖర్‌‌లతో కలిసి ములుగు, భద్రాచలం ప్రాంతాలకు చెందిన నేరచరిత్ర కలిగిన గణేశ్, ప్రేమ్ చంద్, పవన్, లాడె ప్రకాష్, మాచర్ల వినయ్‌‌లను గ్యాంగ్‌‌లో చేర్చుకున్నాడు. ఏప్రిల్ 4న రాత్రి సుమారు 8 గంటల సమయంలో సిద్దిపేటలోని బురుగుపల్లిలో ఉన్న డాక్టర్ శ్యామ్ సుందర్ ఇంట్లోకి ప్రవేశించారు. కత్తులతో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులను బెదిరించి 8.6 తులాల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు, మొబైల్ ఫోన్లను దోచుకున్నారు. అనంతరం బాధితులను చార్జింగ్ తీగలు, తువ్వాళ్లతో కట్టేసి అక్కడి నుంచి పరారయ్యారు. 

రూరల్ పోలీసులు నిందితుల కోసం పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రూరల్ సీఐ శ్రీను ఆధ్వర్యంలో పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి 72 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 4.3 తులాల బంగారు ఆభరణాలు, ఒక బైక్​, ఒక డిజైర్ కారు, పది మొబైల్ ఫోన్లు, రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. కేసు ఛేదనలో చురుకుగా పనిచేసిన ఏసీపీ రవీందర్ రెడ్డి, సీసీఎస్ సీఐ రవీందర్, ఎస్సైలు తిరుపతి, రాజేశ్, చంద్రమోహన్, వివేక్, సౌజన్య, శరత్‌‌లను సీపీ అభినందించారు.