గుల్జార్ హౌస్‌‌కి ఎఫ్​ఎస్​ఎల్, క్లూస్ టీమ్.. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రెండు బృందాలు

గుల్జార్ హౌస్‌‌కి ఎఫ్​ఎస్​ఎల్, క్లూస్ టీమ్.. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రెండు బృందాలు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: హైదరాబాద్‌‌లోని చార్మినార్‌‌‌‌లో అగ్ని ప్రమాదం జరిగిన గుల్జార్‌‌హౌస్‌‌ను మంగళవారం ఫోరెన్సిక్​, క్లూస్ టీం సందర్శించింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డ్, వైరింగ్, ఎయిర్ కండీషనర్ యూనిట్లు, కంప్రెషర్ యూనిట్ శిథిలాలు, ఇతర కాలిపోయిన వస్తువులను పరిశీలించారు. మొత్తం 20 రకాల శాంపిల్స్‌‌ను సేకరించి ల్యాబ్‌‌కు పంపారు. దర్యాప్తు నివేదికను త్వరలో సమర్పిస్తామని అధికారులు వెల్లడించారు. 

ప్రమాదం జరిగిన బిల్డింగ్‌‌లో మొత్తం 14 ఏసీలు ఉన్నాయని, వాటిలో కొన్ని నిరంతరం ఆన్‌‌లో ఉండటం వల్ల అధిక విద్యుత్ లోడ్ ఏర్పడి అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అలాగే, భవనం చాలా పాతదని, గోడలు బీటలు వారాయని, కూలిపోయే దశకు చేరుకుందని గుర్తించారు.

ప్రమాద ఘటనపై నివేదిక ఇస్తాం

గుల్జార్​ హౌస్ ప్రమాద స్థలాన్ని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌‌ చైర్​పర్సన్​ కొత్తకోట సీతా దయాకర్​రెడ్డి మంగళవారం సాయంత్రం కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. ప్రమాదంలో 8 మంది పిల్లలు చనిపోవడంతో ఘటన ఎలా జరిగిందని వారి బంధువులను అడిగి తెలుసుకున్నారు. 

కమిషన్​చైర్​పర్సన్​సీతా దయాకర్​రెడ్డి మాట్లాడుతూ.. గుల్జార్ హౌజ్​వద్ద ఘటన జరిగే రోజే కమిషన్​విజిట్​చేయాల్సి ఉండేదని, కానీ ఇక్కడ పరిస్థితి చక్కబడ్డాక రావాలని అనుకున్నామన్నారు. ఘటన జరిగిన తీరును, పిల్లల మరణాల గురించి వారి కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నామన్నారు. తమ పరిశీలనపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. 

సామగ్రి తీసుకెళ్లిన కుటుంబసభ్యులు

గుల్జార్​హౌస్​ లో మిగిలిన సామాగ్రిని వారి కుటుంబీకులు మంగళవారం తీసుకువెళ్లారు. బయటవైపు మోదీ కుటుంబానికి చెందిన క్రిష్ణా పిరల్స్​, మోదీ పిరల్స్ పేరుతో జువెల్లరీ షాపులున్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో రెండు షాపులు దెబ్బ తినగా, సామాన్లు కాలిపోయాయి. విలువైన జువెల్లరీ సామగ్రి చెల్లాచెదురైంది. ఇంట్లో కూడా సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. 

మిగిలిన విలువైన సామాన్లను కుటుంబీకులు కాపాడుకున్నారు. రెండు రోజుల పాటు ఈ భవనానికి తాళం వేసి వెళ్లారు. మంగళవారం పోలీసులు వచ్చాక,  తాళాలు తీసి షాపులోని జువెల్లరినీ, ఇంట్లో మిగిలిన సామాన్లను వారి వేరే ఇంటికి తరలించారు.