ఎవరు ఓడినా ఎన్నికల్లో గెలిచేది ఇదే!

ఎవరు ఓడినా ఎన్నికల్లో గెలిచేది ఇదే!

ఒక్కరోజు పండుగకే మార్కెట్లు రివ్వున ఎగిసిపడతాయి. అలాంటిది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక ప్రక్రియగా రెండున్నర నెలల పాటు సాగే ఎన్నికల పండుగంటే! ఇండియా అవసరాల్లో 80 శాతం క్రూడ్ ఆయిల్ ను ఇంపోర్ట్ చేసుకుందే కావొచ్చు, దిగుమతులు పెరగడం శుభపరిణామమూ కాకపోవచ్చు, అయినా సరే, బుల్లిష్ సెంటిమెంట్ నేపుల్ చేయబోతున్నాయి 2019 సార్వత్రిక ఎన్నికలు. సువిశాల దేశం నలుమూలల్లోని 543 నియోజకవర్గాల్లో పార్టీల ప్రచార పర్వంతో ఆయిల్ అవసరం పెరగనుంది. ఎన్నికల సీజన్ లో పెట్రోల్ , డీజిల్ డిమాండ్ రోజూ వాడుతున్నదానికంటే అదనంగా 80 వేల బ్యారల్స్ కు చేరనుంది. మొత్తం 90 కోట్ల మంది ఓటర్లు, 10.35 లక్షల పోలింగ్ కేంద్రాలు, గుర్తింపు పొందిన పార్టీల సంఖ్య దాదాపు 2400. ఇక ఇండిపెండెంట్ల లెక్కైతే చాంతాడే. లోక్ సభ543 సీట్లలో ఒక్కోదానికి మినిమమ్20 మంది పోటీ పడ్డా అభ్యర్థుల సంఖ్యే 10 వేలు దాటుతుంది. కంటికి రెప్పలా సదరు క్యాండేట్లను అంటిపెట్టుకు తిరిగే కార్యకర్తల సంఖ్య లక్షల పైమాటే. ఇన్నేసి లక్షల మంది ప్రతి రోజూ బైక్, కారు, ఆటో, ట్రాక్టర్ .. అందుబాటులో ఉన్న ఏదోఒక వాహనం ఎక్కేసి ఊరూరు తిరుగుతూ తమ నేత కోసం ప్రచారం నిర్వహిస్తారు. ఇక స్టార్ క్యాంపెయినర్ల సభలకు కాన్వాయ్​ పొడుగే కిలోమీటర్లు ఉండటం చూస్తూనే ఉంటాం . మొత్తంగా రెండున్నర నెలలపాటు ఎన్నికల ప్రక్రియ ఆయిల్ మార్కె ట్ కు జోష్ ఇవ్వనుంది.

గడిచిన దశాబ్దకాలంగా వాహనాల కొనుగోళ్లు పెరగడం, దానికి అనుగుణంగా పెట్రోల్ , డీజిల్ కు డిమాండ్ ఏర్పడటం తెలిసిందే. 2019 జనవరి నాటికి ఆయిల్ అదనపు డిమాండ్ 75వేల బ్యారల్స్ గా ఉంది. ఎన్నికల సీజన్ లో ఆ డిమాండ్ లక్షబ్యారె ల్స్ కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఆయిల్ మార్కెట్ ఎక్స్ పర్ట్ వెంగ్లిన్ చిన్ అన్నారు. సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఫ్యాక్స్ట్ గ్లోబల్ ఎనర్జీ సంస్థలో పనిచేస్తున్నారాయన. వచ్చే రెండు నెలలు మార్కెట్ కు ఢోకా లేదన్న నమ్మకం మూతబడ్డ కంపెనీలను కూడా తెరుచుకునేలా చేసిందని వెంగ్లిన్ పేర్కొన్నారు. ఆసియాలో మెయింటెనెన్స్ కోసం మూసి వేసిన కొన్ని ఆయిల్ కంపెనీలు ఇటీవలే కార్యకలా పాల్ని ప్రారంభించినట్లు తెలిపారు.

పెట్రోల్ , డీజిల్ తోపాటు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్ పీజీ)కి కూడా డిమాండ్ పెరిగిందని, ఇంటింటికీ గ్యాస్ లాంటి ప్రభుత్వ పథకాలూ ఇందుకు దోహదం చేశాయని చెప్పారు. ముడి చమురును డీజిల్ గా శుద్ధీకరించే కంపెనీల లాభాలు సైతం గడిచిన రెండు నెలల్లో గరిష్టానికి చేరాయి. రాబోయే రెండున్నర నెలలూ రిఫైనరీలు ఉత్పత్తిని పెంచబోతున్నాయి. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్న ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ కొత్త నిబంధనలు ఆయిల్ డిమాండ్ ను సుదీర్ఘకాలం కొనసాగేందుకు దోహదపడతాయని అంచనా. మొత్తంగా ఎన్నికల బండి ఆయిలే ఆయువుపట్టుగా ప్రయాణించనుంది.

ఎన్ని వాహనాలైనా వాడొచ్చు కానీ..
ఎన్నికల సంఘం నిర్దేశించిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్​(ఎంసీసీ) ప్రకారం, ఒక అభ్యర్థి మూడు కంటే ఎక్కువ వాహనాలు వాడితే ఎన్నికల వ్యయంలో చూపించాలి. లెక్కల్లో చూపించగలిగితే ఎన్ని వాహనాలనైనా వాడుకోవచ్చు. కాకుంటే, ఏయే ప్రాంతాల్లో ప్రచారానికి తిరగబోతున్నది ఆ వివరాలను పర్మిట్ల కోసం అభ్యర్థి రిటర్నింగ్‌ అధికారికి లేదా సంబంధిత ఉద్యోగికి సమర్పించాలి. పర్మిట్‌‌ పొందిన వాహనాల నిర్వహణ ఖర్చును రోజువారీ ఎన్నికల ఖర్చు నమోదు చేసే రిజిస్టరులో చేర్చాలి. అలా చేయకుంటే వెహికల్ పర్మిషన్ రద్దవుతుంది. ఇక పర్మిట్‌‌లేని వాహనాన్ని ఉపయోగిస్తే అభ్యర్థి అనధికారికంగా ప్రచారం చేస్తున్నట్లు పరిగణించి ఇండియన్ పీనల్ కోడ్ లోని చాప్టర్ 9ఏ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఇంతా కష్టపడి వాహనాల్లో తిరిగి ప్రచారం చేసినా అభ్యర్థులు ఓడిపోవచ్చేమోగానీ ఎన్నికల్లో గెలుపు మాత్రం ఆయిల్ కంపెనీలదే.