95 ప్లాట్లకు రూ.36.83 కోట్లు

95 ప్లాట్లకు రూ.36.83 కోట్లు
  • రాజీవ్​ స్వగృహ ఓపెన్​ ప్లాట్ల వేలంతో సర్కారుకు మస్తు ఆమ్దానీ

కరీంనగర్‍/మహబూబ్​నగర్, వెలుగు:  రాజీవ్​ సృగృహ ఓపెన్​ ప్లాట్ల అమ్మకంతో రాష్ట్ర సర్కారుకు మస్తు ఆమ్దానీ వస్తున్నది. సోమవారం కరీంనగర్​, మహబూబ్​నగర్ జిల్లాల్లో జరిగిన వేలంపాటలో 95 ప్లాట్లు రూ. 36.83 కోట్లకు అమ్ముడుపోయాయి. కరీనంగర్​ జిల్లా తిమ్మాపూర్​ మండలం నుస్తులాపూర్​లో రాజీవ్​హైవే వెంట ఉన్న​అంగారక టౌన్‍ షిప్ లోని 237 ప్లాట్లను వేలం వేయాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. ఈక్రమంలో సోమవారం ఉదయం 25, మధ్యాహ్నం 25 చొప్పున50 ప్లాట్లకు కరీంనగర్ లోని వాసర గార్డెన్​లో కలెక్టర్ సమక్షంలో వేలంపాట నిర్వహించారు. ఆక్షన్​లో పాల్గొనేందుకు ఉదయం నుంచే వందలాది మంది తరలివచ్చారు. వీరిలో 70శాతం మంది రియల్టర్లు 96 శాతానికి పైగా ప్లాట్లు దక్కించుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు రెండు మూడింతలు పాడడంతో సామాన్యులు వేలం పాట నుంచి తప్పుకున్నారు. 

కమర్షియల్‍ ప్లాటు గరిష్టంగా గజం రూ. 22,600   

కరీంనగర్​లో వేలం వేసిన 50 ప్లాట్లలో 11 కమర్షియల్‍ ప్లాట్లు ఉన్నాయి. రెసిడెన్షియల్​ ప్లాట్లకు గజం రూ. 6 వేలు, కమర్షియల్‍ ప్లాట్లకు రూ. 8 వేల చొప్పున సర్కారు నిర్ణయించింది. అనూహ్యంగా కమర్షియల్‍ ప్లాట్లు కనిష్టంగా రూ. 12,500  నుంచి గరిష్టంగా రూ. 22,600 పలికాయి. రెసిడెన్షియల్‍ ప్లాట్లకు కనిష్టంగా రూ.10,100 నుంచి గరిష్టంగా రూ.18, 600 దాకా పాడారు.  11 కమర్షియల్ ప్లాట్లకు సుమారు రూ. 10 కోట్లు, మిగితా రెసిడెన్షియల్ ప్లాట్లకు రూ. 11.5 కోట్లు కలిపి సర్కారుకు రూ. 21.5 కోట్ల ఆదాయం వచ్చింది.  

మహబూబ్​నగర్​లో రూ.15.33 కోట్లు

మహబూబ్​నగర్​ జిల్లా భూత్పూర్​ మున్సిపాలిటీ పరిధిలో అమిస్తాపూర్​ వద్ద ఉన్న సారిక టౌన్​ షిప్​లోని 348 ప్లాట్లకు అప్పన్నపల్లి శివారులోని ఓ ప్రైవేట్​ ఫంక్షన్​ హాల్​లో సోమవారం ఉదయం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆఫీసర్లు ఆక్షన్​ నిర్వహించారు. మొదటి 60 ప్లాట్లను వేలంలో అమ్మకానికి పెట్టగా, 193 మంది బిడ్డర్లు వేలంలో పాల్గొన్నారు. 45 ప్లాట్లు అమ్ముడుపోగా.. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.15.33 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా ఓ ప్లాట్​ గజం విలువ రూ.19 వేలు, అత్యల్పంగా రూ. 8,100 వరకు పలికింది. ఉదయం కలెక్టర్​ ఎస్​.వెంకట్రావు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. సారిక టౌన్​ షిప్​లో ఓపెన్ ప్లాట్స్ కోసం ఇది వరకే ఒక విడత వేలం నిర్వహించామని, ప్రస్తుతం రెండో విడత వేలం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, అవసరమైన వారు హెల్ప్ డెస్క్​ను సంప్రదించాలని ఆయన సూచించారు.