V6 News

గురుకుల టెండర్లకు ఫుల్ రెస్పాన్స్.. ప్రీ బిడ్ మీటింగ్కు100 మంది కాంట్రాక్టర్లు, ఏజెన్సీలు హాజరు

గురుకుల టెండర్లకు ఫుల్ రెస్పాన్స్.. ప్రీ బిడ్ మీటింగ్కు100 మంది కాంట్రాక్టర్లు, ఏజెన్సీలు హాజరు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన వస్తువుల సరఫరా టెండర్లకు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నెల 6న ఎస్సీ గురుకుల సొసైటీ అధికారులు ప్రీ బిడ్ మీటింగ్ నిర్వహించగా.. సుమారు 100 మంది కాంట్రాక్టర్లు, ఏజెన్సీలు అటెండ్ అయ్యారు. 

టెండర్లకు సంబంధించి కొన్ని నిబంధనలను సవరించాలని కాంట్రాక్టర్లు అధికారులను కోరారు. ఈఎండీ అమౌంట్ ను తగ్గించాలన్నారు. స్కూల్ యూనిఫాంలు సప్లై చేసే కాంట్రాక్టర్ లేదా ఏజెన్సీకి ఏడాదికి రూ.250 కోట్ల టర్నోవర్ ఉండాలని ప్రభుత్వం రూల్ పెట్టిందని.. ఈ టర్నోవర్ ను తగ్గించాలని విన్నవించారు. 

మరోవైపు గురుకులాలకు సరఫరా చేసే వస్తువుల టెండర్లు తమకు కేటాయించాలని చిన్న తరహా పరిశ్రమల నిర్వాహకులు కోరారు. ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆఫీసర్లు పేర్కొన్నారు. ప్రీ బిడ్ మీటింగ్ లో కాంట్రాక్టర్లు, ఏజెన్సీలు తమ దృష్టికి తీసుకొచ్చిన సలహాలు, సూచనలను పీఎంయూ చైర్మన్, స్పెషల్ సీఎస్ సబ్యసాచి ఘోష్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. 

  • పీఎంయూ ఏర్పాటు చేసిన సర్కారు

2026–27 అకాడమిక్ ఇయర్ కు సంబంధించి విద్యార్థులకు అవసరమైన వివిధ రకాల వస్తువుల సరఫరా కోసం ప్రాజెక్టు మానిటరింగ్‌‌ యూనిట్‌‌(పీఎంయూ)ను సర్కారు ఏర్పాటు చేసింది. నోడల్ ఏజెన్సీగా ఎస్సీ గురుకుల సొసైటీని నియమించింది. టెండర్ దాఖలుకు ఈ నెల 13 వరకు గడువు విధించగా.. దాన్ని 17 వరకు పొడిగించారు. 

రాష్ట్రంలో గురుకుల స్టూడెంట్స్, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మొత్తం 27 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మొత్తం 9 రకాల వస్తువుల సరఫరాకు టెండర్లు పిలిచారు. వీటిలో స్కూల్‌‌, వైట్‌‌యూనిఫామ్‌‌ క్లాత్‌‌, స్కూల్‌‌ బ్యాగులు, షూలు, సాక్స్‌‌లు, టై, బెల్టులు, బెడ్డింగ్‌‌మెటీరియల్, ఐడీ కార్డులు, స్టేషనరీ కిట్లు, పీటీ డ్రెస్‌‌, నైట్‌‌డ్రెస్‌‌, ట్రాక్‌‌ సూట్లు, భోజనానికి ప్లేట్లు, గ్లాసులు, కటోరా, కప్పులు, స్పూన్లు, ట్రంక్‌‌ బాక్సులు, నోట్‌‌బుక్‌‌లు, ట్రాలీ బ్యాగులు ఉన్నాయి.