కామారెడ్డి, వెలుగు : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్ట్ నేత చందర్‌రావు అలియాస్ స్వామి అలియాస్ ప్రభాకర్ అంత్యక్రియలు సొంతూరు కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడిలో ఆదివారం ముగిశాయి. వెస్ట్ జోన్ బ్యూరో ఇన్‌చార్జిగా పనిచేస్తున్న చందర్‌రావు నాలుగు రోజుల కింద జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు శనివారం గడ్చిరోలి వెళ్లి చందర్‌రావు డెడ్‌బాడీని ఇస్రోజివాడికి తీసుకొచ్చారు.
మాజీ మావోయిస్ట్‌లు, పౌరహక్కుల సంఘం ప్రతినిధులు, అమరుల బంధుమిత్రుల కమిటీ ప్రతినిధులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. అనంతరం విప్లవగీతాలు పాడుకుంటూ అంతిమయాత్ర, అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్ జి.లక్ష్మణ్, జనరల్ సెక్రటరీ నారాయణరావు, అమరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర ప్రతినిధి పద్మకుమారి, నాయకులు కుమారస్వామి, పాణి, బాలసాని రాజయ్య పాల్గొన్నారు.
