వర్గీకరణ పరిష్కారం కాదు : జి.చెన్నయ్య

వర్గీకరణ పరిష్కారం కాదు : జి.చెన్నయ్య
  • వర్గీకరణ పరిష్కారం కాదు
  • వెనుకబాటుకు గురైన వాళ్లను అభివృద్ధిలోకి తేవాలి
  • మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ చెన్నయ్య
  • ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌‌లో మహా ధర్నా

ముషీరాబాద్, వెలుగు : ఎస్సీల్లో వెనుకబాటుకు గురైన వాళ్లను అభివృద్ధిలోకి తేవాలని, దీనికి వర్గీకరణ మార్గం కాదని మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి.చెన్నయ్య అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభివృద్ధిని పట్టించుకోకుండా ఎస్సీ కుటుంబాల మధ్య ఉన్న అంతరాలను చూపిస్తూ వర్గీకరణ చేస్తామనడం సబబు కాదన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఒకపక్క పార్లమెంటులో వర్గీకరణ సాధ్యం కాదని చెప్పి.. ఇక్కడ ఓట్ల కోసం వర్గీకరణ చేస్తానని హామీ ఇస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ చేస్తా మంటే  తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని పాత రేసి, డిపాజిట్లు రాకుండా ఓడిస్తామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో మాల యుద్ధభేరీ సభ జరిగింది. ఈ సభకు జేఏసీ చైర్మన్ చెన్నయ్య, వర్కింగ్ చైర్మన్ బూర్గుల వెంకటేశ్వర్లు, మన్నే శ్రీధర్ రావు, గోపోజు రమేశ్, జంగా శ్రీనివాస్ తదితరులు హాజరై మాట్లాడారు. 

తెలంగాణలో మాదిగల కంటే మాలలు పూర్తిగా వెనుకబడి ఉన్నారని, కొన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడి రాష్ట్రంలోని లెక్కలు బూచిగా చూపుతూ మాల మాదిగలను కలవకుండా చేస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాధికారం వైపు చూడకుండా వర్గీకరణ అస్త్రాన్ని పదేపదే ప్రయోగిస్తున్నాయని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడానికి మాలలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మాల కులాన్ని అణచివేయాలనే ఉద్దేశంతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వర్గీకరణ కత్తి కట్టాయన్నారు. బైండ్ల శ్రీనివాస్, ఆనంద్ రావు, కోటేశ్వరరావు, రాజేశ్, మహేశ్, గాజుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రధాన మంత్రా? ఎమ్మార్పీఎస్ నాయకుడా?

నరేంద్ర మోదీ దేశ ప్రధానా? ఎమ్మార్పీఎస్ నాయకుడా? అని మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ చెన్నయ్య ఓ ప్రకటనలో మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని, అలాంటి దానిపై కమిటీ వేస్తానని హామీ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఇది కోర్టు ధిక్కారం కిందికే వస్తుందన్నారు. రాజ్యాంగ సంస్థలైన సుప్రీంకోర్టు, జాతీయ ఎస్సీ కమిషన్‌పై రాజకీయ ఒత్తిడి తీసుకురావడం అనైతికమని చెప్పారు. బీజేపీకి మాలలు ఓటు వేయొద్దంటూ పిలుపునిచ్చారు.