ఫుడ్ సెక్యూరిటీపై చర్చించాలె..జీ20 వ్యవసాయ మంత్రుల మీటింగ్‌‌‌‌పై ప్రధాని మోదీ

ఫుడ్ సెక్యూరిటీపై చర్చించాలె..జీ20 వ్యవసాయ మంత్రుల మీటింగ్‌‌‌‌పై ప్రధాని మోదీ
  •     వ్యవసాయ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నది
  •     ఆహార వ్యవస్థలను నిర్మించే మార్గాలను వెతకాలి

హైదరాబాద్, వెలుగు: ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ ఆరోగ్య భద్రతను సాధించేందుకు తీసుకోవాల్సిన ఉమ్మడి చర్యలపై జీ20 వ్యవసాయ మంత్రుల మీటింగ్‌‌‌‌లో చర్చించాలని సూచించారు. సన్నకారు రైతులపై దృష్టి సారించి సస్టెయినబుల్, కలెక్టివ్ ఆహార వ్యవస్థలను నిర్మించడానికి మార్గాలను కనుగొనాలన్నారు. ప్రపంచ ఎరువుల సరఫరా గొలుసులను బలోపేతం చేయడానికి దారులను వెతకాలని కోరారు. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌లో జరుగుతున్న జీ20 సదస్సుకు శుక్రవారం ఆయన వీడియో మెసేజ్‌‌‌‌ పంపారు. క్లైమేట్ చేంజ్‌‌ విపరీతమైన వాతావరణ పరిస్థితులకు కారణమవుతున్నదని, గ్లోబల్ సౌత్ ఈ సవాళ్లను ఎక్కువగా ఎదుర్కొంటున్నదని అన్నారు.

ప్రకృతి వ్యవసాయం వైపు

నేల బాగుండేందుకు, దిగుబడి పెరిగేందుకు వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ప్రధాని అన్నారు. ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ పద్ధతులు మనకు స్ఫూర్తినిస్తాయని వివరించారు. ఆహార వృథాను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని, వ్యర్థాల నుంచి సంపదను సృష్టించడంపై పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ‘బ్యాక్ టు బేసిక్స్’, ‘మార్చ్ టు ఫ్యూచర్’ కలయికే భారతదేశ విధానమని అన్నారు. సహజ వ్యవసాయంతో పాటు సాంకేతికతతో కూడిన వ్యవసాయాన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. కాగా, పంట ఉత్పత్తిని పెంచేందుకు రైతులు టెక్నాలజీని వాడుతున్నారని మోదీ చెప్పారు.మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రపంచాన్ని యోగా ఏకతాటిపైకి తీసుకువస్తుందని ప్రధాని అన్నారు. యోగా ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించారు.

ఆరు రోజుల విదేశీ పర్యటనకు మోదీ

న్యూఢిల్లీ: ఆరు రోజుల విదేశీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్తున్నారు. ఈ నెల 20 నుంచి 25వ తేదీ దాకా అమెరికా, ఈజిప్టులో పర్యటించనున్నారని విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. ‘‘మోదీ పర్యటన న్యూయార్క్‌‌‌‌లో ప్రారంభమవుతుంది. 21న అక్కడ ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు మోదీ నాయకత్వం వహిస్తారు. తర్వాత వాషింగ్టన్‌‌‌‌కు వెళ్తారు. 22న వైట్‌‌‌‌హౌస్‌‌‌‌లో అమెరికా ప్రెసిడెంట్‌‌‌‌ బైడెన్‌‌‌‌తో భేటీ అవుతారు. సాయంత్రం అధికారిక విందులో పాల్గొంటారని విదేశాంగ శాఖ చెప్పింది. అమెరికా కాంగ్రెస్​లో ప్రధాని ప్రసంగించనున్నారని పేర్కొంది.