- గగన్‌పహాడ్‌లో ఉద్రిక్తత
గండిపేట, వెలుగు: ఇరువర్గాల మధ్య ఘర్షణలో ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఈ ఘటన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్‌పహాడ్‌లో ఉద్రిక్తతకు దారితీసింది. గగన్‌పహాడ్‌కు చెందిన శ్రావణికి, బడంగ్‌పేట్‌కు చెందిన సాకేత్‌తో ఏడాది క్రితం వివాహం జరిగింది. కొంతకాలంగా భార్యాభార్తల మధ్య మనస్పర్థలు, కుటుంబ విషయాలపై గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో బుధవారం సాకేత్ సుమారు 40 మంది బంధువులతో కలిసి శ్రావణి తల్లిగారింటికి వెళ్లాడు. అక్కడ ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ జరగగా.. శ్రావణి నానమ్మ ఈశ్వరమ్మ తీవ్రంగా గాయపడింది. దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతిచెందింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేసరికి సాకేత్ వర్గం పరారైంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
