గంగమ్మ ఒడికి గణపయ్య..ఉమ్మడి నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్ లో ఘనంగా లంబోదరుని నిమజ్జనోత్సవం

గంగమ్మ ఒడికి గణపయ్య..ఉమ్మడి నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్ లో ఘనంగా లంబోదరుని నిమజ్జనోత్సవం
  • ఘనంగా లంబోదరుని నిమజ్జనోత్సవం 
  •     ఉమ్మడి నల్గొండ, మెదక్, మహబూబ్​నగర్​లో వైభవంగా శోభాయాత్రలు
  •     డప్పు చప్పుళ్లు, తీన్మార్ స్టెప్పులతో వీడ్కోలు పలికిన భక్తులు

నెట్​వర్క్, వెలుగు : తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న లంబోదరుని నిమజ్జనోత్సవం ఉమ్మడి నల్గొండ, మెదక్, మహబూబ్​నగర్​ జిల్లాల వ్యాప్తంగా బుధవారం అత్యంత వైభవంగా, కోలాహలంగా ముగిసింది. నల్గొండ జిల్లాలో 6,184, సూర్యాపేటలో 3,150 విగ్రహాలతో పాటు యాదాద్రి జిల్లాలోనూ వేలాది గణనాథులను భక్తులు గంగమ్మ ఒడికి చేర్చారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ స్టెప్పులతో శోభాయాత్రలు హోరెత్తగా, యువకులు ఉత్సాహంగా రంగులు చల్లుకుంటూ ఘనంగా వీడ్కోలు పలికారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని ఆర్టీసీ బస్ డిపో కాలనీ, హనుమాన్ నగర్‌‌లోని గణేశ్ మండపాలను మంత్రి పొన్నం ప్రభాకర్​ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. 

దేవరకొండ పట్టణంలోని  పలు మండపాల్లో కొలువుదీరి నిమజ్జనానికి సిద్ధంగా ఉన్న వినాయకుడికి ఎమ్మెల్యే  బాలు నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. కొమరవెల్లి మల్లన్న ఆలయంలో పుష్కరిణి కోనేరులో శాస్త్రోక్తంగా నిమజ్జనం నిర్వహించారు. కడ్తాల్​ మండలం మైసిగండిలో నిర్వహించిన గణనాథుల లడ్డూల వేలంపాటలో భక్తులు భారీ ధరలు చెల్లించి దక్కించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్​ అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ (14వ మైలు), నల్గొండలోని వల్లభరావు చెరువు, సూర్యాపేట సద్దుల చెరువు, యాదాద్రి పెద్ద చెరువు వంటి ప్రధాన నిమజ్జన కేంద్రాల వద్ద క్రేన్లు, ఫైర్ ఇంజన్లు, వైద్య సిబ్బంది, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు అధికారుల సమన్వయంతో ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి.