పీవోకేను శ్మశానవాటికగా మార్చిండ్రు..యూఎన్ లో పాకిస్తాన్ పై కాశ్మీరీ మహిళ తస్లీమా ఫైర్

పీవోకేను శ్మశానవాటికగా మార్చిండ్రు..యూఎన్ లో పాకిస్తాన్ పై కాశ్మీరీ మహిళ తస్లీమా ఫైర్
  • ‘ఆజాద్ కాశ్మీర్’ అతిపెద్ద అబద్ధమని ఆరోపణ
  • స్వతంత్ర దర్యాప్తునకు డిమాండ్ 

జెనీవా: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)లో దాయాది​ కొనసాగిస్తున్న అరాచకాలపై కాశ్మీరీ మహిళ, సామాజిక- రాజకీయ కార్యకర్త తస్లీమా అక్తర్ ఫైర్​అయ్యారు. జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్​హెచ్ఆర్సీ) 63వ సమావేశంలో పీవోకే దుస్థితిని ప్రస్తావించారు.

 ఆ ప్రాంతంలో శాంతియుత నిరసనలపై పాక్ సాగిస్తున్న అణచివేతను తీవ్రంగా ఖండించారు. పాక్ తప్పుడు ప్రచారాలను ఎదుర్కోవడానికి తానెప్పుడూ భయపడనని స్పష్టంచేశారు. ‘‘ఆజాద్ కాశ్మీర్’ పెద్ద అబద్ధం.. పీవోకేను ‘ఆజాద్ కాశ్మీర్’ అని పిలవడం పాక్ ​చేస్తున్న అతిపెద్ద మోసం. ప్రాథమిక హక్కుల కోసం ప్రశ్నించిన వారిపై బుల్లెట్ ప్రయోగిస్తే అది స్వతంత్ర దేశం ఎలా అవుతుంది?’’ అని ప్రశ్నించారు.

నిరాయుధులను కాల్చి చంపుతున్నరు..

మొదట టెర్రరిస్టులను పంపి జమ్మూకాశ్మీర్‌‌‌‌ను శ్మశానవాటికగా మార్చాలని ప్రయత్నించిన పాక్.. ఇప్పుడు నిరసన తెలుపుతున్న నిరాయుధులను కాల్చి చంపుతూ పీవోకేను కూడా అలాగే మార్చేసిందని తస్లీమా అక్తర్ ఫైర్​అయ్యారు. 

జీవన ప్రమాణాలు, ఆర్థిక సమస్యలపై 'జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ' ఆధ్వర్యంలో జరిగిన శాంతియుత నిరసనలను పాక్ సర్కార్ అణచివేసిందని తెలిపారు. వందలాది మంది యాక్టివిస్టులను అరెస్ట్ చేసి, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారని, దాడుల్లో చాలామంది చనిపోయారని ఆరోపించారు.

 పాక్ భద్రతా బలగాల దాడులు ఆపి, కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించాలని యూఎస్​హెచ్ఆర్సీని కోరారు. పీవోకేలో జరిగిన ప్రతి హత్యపైనా స్వతంత్ర దర్యాప్తు చేయాలని తస్లీమా డిమాండ్ చేశారు.