గంటలు కొడితే కరోనా వైరస్ చచ్చిపోతుందా? గల్గోటియాస్ యూనివర్సిటీ వింత పరిశోధనపై నెటిజన్ల ఫైర్

గంటలు కొడితే కరోనా వైరస్ చచ్చిపోతుందా? గల్గోటియాస్ యూనివర్సిటీ వింత పరిశోధనపై నెటిజన్ల ఫైర్

మొన్న ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో రోబో డాగ్ రచ్చ.. నిన్న ఆ పాత కరోనా రీసెర్చ్ ఉపసంహరణ.. వరుస కాంట్రవర్సీలతో ప్రస్తుతం సోషల్ మీడియాలో గల్గోటియాస్ యూనివర్సిటీ పేరు మారుమోగిపోతోంది. ఇండియా ఏఐ సమ్మిట్ 2026లో మొదలైన ఒక చిన్న వివాదం.. ఏకంగా నాలుగేళ్ల క్రితం నాటి ఒక వింత పరిశోధనా పత్రాన్ని బయటకు లాగడమే కాకుండా, దాన్ని యూనివర్సిటీ డిలీట్ చేసే వరకు వెళ్లింది. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు.

రోబో డాగ్ వివాదం ఏంటి?
ఇటీవల జరిగిన ఇండియా ఏఐ సమ్మిట్‌లో గల్గోటియాస్ యూనివర్సిటీకి చెందిన కమ్యూనికేషన్స్ ప్రొఫెసర్ నేహా సింగ్, ఒక రోబోటిక్ డాగ్‌ను ప్రదర్శించారు. ఓరియన్ అని పిలిచే ఈ రోబోను తమ యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్వయంగా తయారు చేసిందని ఆమె డీడీ న్యూస్ కెమెరా ముందు గర్వంగా చెప్పారు. అయితే ఈ వీడియో వైరల్ అవ్వగానే నెటిజన్లు అసలు నిజాన్ని బయటపెట్టారు. అది చైనాకు చెందిన యూనిట్రీ రోబోటిక్స్ తయారు చేసిన Unitree Go2 రోబో అని ఆధారాలతో సహా తేలిపోయింది. దీంతో సమ్మిట్ లో ఏర్పాటు చేసిన స్టాల్ ఖాళీ చేయించడమే కాకుండా.. సదరు ప్రొఫెసర్ అత్యుత్సాహం వల్ల జరిగిన పొరపాటు అంటూ యూనివర్సిటీ క్షమాపణలు చెప్పింది.

బయటపడ్డ 'థాలీ - గంట' రీసెర్చ్ పేపర్..
ఈ రోబో వివాదంతో గల్గోటియాస్ యూనివర్సిటీపై నెటిజన్లు దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే 2020లో వారు ప్రచురించిన ఒక వింత రీసెర్ట్ పేపర్ బయటపడింది. ఆ పేపర్ టైటిల్ ఏంటో తెలుసా? కరోనా వైరస్ కిల్డ్ బై సౌండ్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్డ్ బై థాలీ ఆర్ ఘంటి. అంటే కంచాలతో సౌండ్ చేయటం, గంటలు వాయించడం ద్వారా వచ్చే శబ్ద తరంగాలతో కరోనా వైరస్‌ను చంపేయొచ్చని ఆ పరిశోధన సారాంశం. అప్పట్లో ఈ పేపర్ పెద్దగా ఎవరి దృష్టికి రాకపోయినా, ఇప్పుడు సైంటిఫిక్ కమ్యూనిటీ దీన్ని అశాస్త్రీయమైన, బాధ్యతారాహిత్యమైనది అంటూ తీవ్రంగా విమర్శించింది.

యూనివర్సిటీ దిద్దుబాటు చర్యలు..
విమర్శలు వెల్లువెత్తడంతో గల్గోటియాస్ యూనివర్సిటీ తక్షణమే స్పందించింది. ఆ రీసెర్చ్ పేపర్‌ను అన్ని ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. టెక్నికల్ గ్లిచ్ వల్ల తప్పుడు పేపర్ పబ్లిష్ అయిందని, ఇది పాఠకులను తప్పుదోవ పట్టించేలా ఉందంటూ యూనివర్సిటీ ఒక నోట్ కూడా విడుదల చేసింది. దీనికి బాధ్యులైన రచయిత, ఎడిటర్, సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తప్పులను కవర్ చేసుకునే పనిలో పడింది. 

మొత్తానికి ఒక చైనా రోబోను తమ స్వంత ఆవిష్కరణగా చెప్పుకోవడమే కాకుండా.. అశాస్త్రీయ పరిశోధనలతో ఇప్పుడు ఈ యూనివర్సిటీ సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్‌కు గురవుతోంది. దీంతో విద్యాసంస్థల్లో పరిశోధనల నాణ్యతపై మరోసారి చర్చకు దారితీసింది.