
న్యూఢిల్లీ: ఉగ్రవాదం అంతమయ్యే వరకు ఐసీసీ ఈవెంట్లలో పాకిస్తాన్‌తో ఇండియా ఆడకూడదని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. ‘ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఉగ్రవాదం ఆగనంత వరకు పాక్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఆడకూడదు. అయితే మనం ఆడాలా? వద్దా? అనేది నిర్ణయించేది మాత్రం ప్రభుత్వమే. క్రికెట్ మ్యాచ్, బాలీవుడ్ సంబంధాలు, ఇతర సంభాషణలు భారతీయ పౌరుల ప్రాణాల కంటే ముఖ్యం కాదని నేను గతంలోనే చెప్పా. మన కుటుంబంలో ఓ వ్యక్తిని కోల్పోయేంత వరకు మనం ఎందుకు ఆగాలి.
ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా ఆడటంపై బీసీసీఐ, గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటాయి. వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుకూలంగా ఉండాలి. రాజకీయం చేయకూడదు’ అని హెడ్ కోచ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక టీమిండియా సూపర్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫామ్‌లో ఉన్నంత వరకు టీమ్‌లో భాగంగా ఉంటారని గంభీర్ అన్నాడు. ఇంగ్లండ్ టూర్‌కు వీరిద్దర్ని ఎంపిక చేయడంలో తన పాత్ర ఉండదని స్పష్టం చేశాడు. ‘జట్టును ఎంపిక చేయడం కోచ్ బాధ్యత కాదు. అది సెలెక్టర్ల బాధ్యత. మ్యాచ్ ఆడే తుది 11 మందిని మాత్రమే కోచ్ ఎంపిక చేస్తాడు. నాకంటే ముందు కోచ్‌గా పని చేసిన వారెవరూ సెలెక్టర్లు కాదు. కాబట్టి నేను కూడా సెలెక్టర్‌ను కాదు. ఇక రోహిత్, కోహ్లీ మంచి పెర్ఫామెన్స్ ఇచ్చేంతవరకు జట్టులో భాగంగానే ఉంటారు. రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత విషయం. కోచ్, సెలెక్టర్, బీసీసీఐ ఈ విషయంపై ఏం చెప్పదు. బాగా ఆడితే 40కే ఎందుకు 45 ఏళ్ల వరకు కూడా మనల్ని ఎవరూ ఆపరు’ అని గౌతీ పేర్కొన్నాడు.
మాజీ క్రికెటర్లపై గౌతీ గుస్సా..
ఇక కొంతమంది మాజీ ప్లేయర్లు ఇండియా క్రికెట్‌ను తమ వ్యక్తిగత రాజ్యంగా భావిస్తున్నారని గౌతీ చురకలు అంటించాడు. 25 ఏండ్లుగా కామెంటరీ బాక్సులో కూర్చొని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించాడు. ‘నేను కోచ్ పదవిలోకి వచ్చి ఎనిమిది నెలలు అయ్యింది. ఫలితాలు రాకపోతే విమర్శించొచ్చు. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అదే పనిగా మాట్లాడుతుంటారు. ఇండియా క్రికెట్ ఎవరి ఆస్తి కాదు. ఇది140 కోట్ల మంది భారతీయులది. కామెంటరీలో కూర్చొనే వ్యక్తులు నా కోచింగ్ గురించి, తలకు గాయం అయిన తర్వాత 2011 ఇంగ్లండ్ టూర్ నుంచి నిష్క్రమించినప్పుడు జరిగిన కంకషన్లు, చాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్‌మనీ పంపిణి గురించి ప్రశ్నలు వేస్తున్నారు. గాజు గ్లాస్‌ల్లో కూర్చొని మాట్లాడేవాళ్లు ఇతరులపై రాళ్లు విసరకూడదు’ అని గంభీర్ ధ్వజమెత్తాడు. ఇక, కెప్టెన్ రోహిత్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు.