తాళ ప్రొద్దటూరులో కొనసాగుతున్న గండికోట ముంపువాసుల ఆందోళన

తాళ ప్రొద్దటూరులో కొనసాగుతున్న గండికోట ముంపువాసుల ఆందోళన

కడప: తాళ ప్రొద్దటూరులో గండికోట ముంపు వాసుల ఆందోళన కొనసాగుతోంది. డ్యాం లో నిల్వ ఉంచిన నీటిక తోడు భారీ వర్షాలు.. వరదలతో పరిసరాలన్నీ జలమయం అయినప్పటికీ నిరసన కొనసాగిస్తున్నారు. చుట్టుముట్టిన వరద నీటిలో నిరస వ్యక్తం చేస్తున్న నిర్వాసితులు.. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదంటున్నారు. భారీ వర్షాలు.. వరదలకు ఊరంతా జలమయం అయినప్పటికీ ఇళ్లలోనే ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే కాలకృత్యాలు, ఆహార పానీయాలకు నానా తిప్పలు పడుతున్నా ఆందోళన విరమించడం లేదు.

ప్రభుత్వం స్పందించి పరిహారం చెల్లించడంతోపాటు తమకు పునరావసం కల్పించాకే రిజర్వాయర్లో నీటిని నిల్వ ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక వైపు నీటిలో విష సర్పాలతో ప్రాణాలకు ప్రమాదం ఉందని భయాందోళన వెంటాడుతోంది. ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి తమను ఆదుకోవాలని అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. పలుమార్లు వివిద రాజకీయ పార్టీల అధికార, బిజెపి పార్టీ నేతలు, ముంపువాసులు కలెక్టర్ హరికిరణ్ తో చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది.

ఆందోళన కొనసాగించడం తప్ప తమకు మరో మార్గం లేదని నిరసనలు కొనసాగిస్తున్నారు నీటి ముంపు వాసులు.  నీటిని నిల్వ విషయంలో వెనక్కి తగ్గేది లేదని అధికార యంత్రాంగం పదే పదే స్పష్టం చేస్తున్నా ఆందోళనకారులు మెట్టు దిగడం లేదు. నీటి నిల్వలు మరింత పెరిగితే ఇళ్లన్నీ పూర్తిగా మునిగిపోయి కట్టుబట్టలతో రోడ్డున పడాల్సి వస్తుందని బాధితులు ఆందోళన చెందుతున్నారు.