వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

షాద్ నగర్, వెలుగు: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి 30 తులాల బంగారం, కిలో వెండి స్వాధీనం చేసుకున్నారు. షాద్ నగర్ ఏసీపీ కుశలాకర్ వివరాలు వెల్లడిం చారు. చేవెళ్ల మండలంలోని దేవుని ఎర్రవెల్లి గ్రామానికి చెందిన రాఘవేందర్ రెడ్డి అలియాస్ రాజు(37), కొడంగల్ మండలంలోని పోచమ్మ గుట్ట తండాకు చెందిన జర్పుల మోతిరాం(35), వనపర్తి జిల్లా పానగల్ మండలంలోని రమద్దుల గ్రామానికి చెందిన గొల్లకుంట్ల చందు(36) పరిగిలోని ఓ రూమ్ లో ఉంటూ కూలి పని చేసుకుంటూ ఆపై చోరీలకు పాల్పడుతున్నారు. గత నెల 18న షాద్ నగర్ పట్టణం విజయ నగర్ కాలనీలోని వారణాసి జగన్ అనే వ్యక్తి ఇల్లు తాళం వేసి ఉండగా.. తాళం పగులగొట్టి ఆ ఇంట్లోకి చొరబడి బీరువాలోని 20 తులాల బంగారం,13 తులాల వెండి దొంగిలించారు. జగన్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న షాద్ నగర్ పోలీసులు శంషాబాద్ సీసీఎస్ పోలీసుల సహాయంతో చోరీకి పాల్పడ్డ ఈ ముగ్గురిని గుర్తించి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30 తులాల బంగారం, కిలో వెండి స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. రాఘవేందర్ ​రెడ్డిపై ఇప్పటికే పలు స్టేషన్లలో 15 కేసులున్నట్లు గుర్తించారు.