గంజాయి కేసులో ఇరికించబోయి..ఈగల్ టీం కానిస్టేబుల్ తానే ఇరుక్కున్నడు ..కరీంనగర్ జిల్లాలో ఘటన

గంజాయి కేసులో ఇరికించబోయి..ఈగల్ టీం కానిస్టేబుల్  తానే ఇరుక్కున్నడు ..కరీంనగర్ జిల్లాలో ఘటన
  • భూ వివాదంలో ప్రత్యర్థికి చెందిన రైతు సేవా కేంద్రంలో ..
  • కిలో గంజాయి పెట్టించిన ఈగల్ కానిస్టేబుల్
  • మిగిలింది తన ఇంట్లో దాచడంతో పట్టుకున్న పోలీసులు

కొత్తపల్లి, వెలుగు : ఓ వ్యక్తిని గంజాయి కేసులో ఇరికించేందుకు ప్రయత్నించిన 'ఈగల్' టీం కానిస్టేబుల్ చివరకు.. తన ఇంట్లోనే గంజాయితో పట్టుబడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో జరిగింది. కరీంనగర్ రూరల్ ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం... సీతారాంపూర్ గ్రామానికి చెందిన టీజీఎస్పీ కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు కరీంనగర్ ఈగల్ టీంలో పనిచేస్తున్నాడు. 

నాగరాజుకు గతంలో చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన తోడేటి శ్రీనివాస్​తో పరిచయం ఏర్పడింది. శ్రీనివాస్​కు అదే గ్రామానికి చెందిన మట్టా శ్రీనివాస్​రెడ్డితో భూతగాదాలు ఉన్నాయి. ఈ పంచాయితీ ఎంతకూ పరిష్కారం కాకపోవడంతో శ్రీనివాస్ రెడ్డిపై ఏదైనా కేసు పెట్టించి జైలుకు పంపించాలని ప్లాన్ చేశారు. తోడేటి శ్రీనివాస్, సదానందం, ఆనంద్, ఆకాష్​తో కలిసి కానిస్టేబుల్ నాగరాజు తనకు తెలిసిన స్మగ్లర్లతో గంజాయి తెప్పించాడు. 

అందులోంచి కిలో గంజాయిని ఇందుర్తిలోని శ్రీనివాస్​రెడ్డికి చెందిన ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో పెట్టించాడు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చి శ్రీనివాస్ రెడ్డిపై చిగురుమామిడి పోలీస్ స్టేషన్ లో గంజాయి కేసు నమోదయ్యేలా చేశారు. అయితే శ్రీనివాస్ రెడ్డిని ఇరికించేందుకు తెప్పించిన గంజాయిలో మరో 370.96 గ్రాములను నాగరాజు సీతారాంపూర్​లోని తన ఇంట్లోనే దాచుకున్నాడు. శ్రీనివాస్ రెడ్డిపై నమోదైన కేసు విచారణలో భాగంగా... నాగరాజు ఇంట్లో గంజాయి ఉన్నట్లు తెలిసింది. దీంతో కొత్తపల్లి పోలీసులు నాగరాజు ఇంటిపై దాడి చేసి, 370.96 గ్రాముల గంజాయి, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు.