- కరీంనగర్ స్మార్ట్ సిటీగా ఎంపికైనప్పుడు నువ్వు కార్పొరేటర్‌వే
- బండి సంజయ్ పై ఎమ్మెల్యే గంగుల ఫైర్
కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్‌ను కేంద్రమంత్రిగా అభివృద్ధి చేయలేని బండి సంజయ్.. బీజేపీకి మేయర్ పదవి కట్టబెడితే చేస్తాడా అని మాజీ మంత్రి,ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. శుక్రవారం కరీంనగర్‌లోని గంగుల కమలాకర్ నివాసంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ స్మార్ట్ సిటీగా ఎంపికైనప్పుడు బండి సంజయ్ కార్పొరేటరేనన్నారు.
కరీంనగర్‌లో జరిగిన అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని, ఆ అభివృద్ధిని తన హయాంలో జరిగినట్లు బండిసంజయ్ బ్రోచర్ విడుదల చేయడం హాస్యాస్పదమన్నారు. ఆ బ్రోచర్ మొత్తం అబద్ధమని, దానిలో పేర్కొన్న వాటిలో ఒక్క పని విషయంలోనైనా సంజయ్ నిధులు విడుదల చేసినట్లు జీవోలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. నిధులు తేవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
మాజీ ఎంపీ మాట్లాడుతూ గుమ్లాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే ఎలా అంటారని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ సీఎం రేవంత్‌రెడ్డి.. గుమ్లాపూర్ వంటి గ్రామంలో బహిరంగ సభ పెట్టడం.. సంజయ్, రేవంత్‌రెడ్డి మధ్య రహస్య ఒప్పందం ఉందా అని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, బీఆర్ఎస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ జీవీ రామకృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.
