
- బీసీ రిజర్వేషన్ల జీవోపై పొన్నంకు అవగాహన లేదన్న గంగుల
- ఆకారం ఉంటేనే అవగాహన ఉంటదనుకోవడం పొరపాటన్న పొన్నం
- తానూ బాడీ షేమింగ్ కామెంట్స్ చేయగలనన్న గంగుల
- అవగాహన లేదనే మాటను వెనక్కి తీసుకోవాలన్న శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మధ్య వాడీవేడి చర్చ జరిగింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కులగణనపై జీవో 26ను బీసీ కమిషన్ ద్వారా ఇచ్చారని, ఆ తర్వాత బీసీ కమిషన్ మాయమైపోయిందని మున్సిపాలిటీ చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా గంగుల కమలాకర్ అన్నారు.ఆ తర్వాత జీవో 18ని ప్లానింగ్ కమిషన్ ద్వారా ఇచ్చారన్నారు. దీనిపై కల్పించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. బీసీ కమిషన్ మాయమైపోయిందనడం సరికాదన్నారు. కొందరు కోర్టులో కేసు వేస్తే.. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేస్తూ జీవో 18ను ఇచ్చామని గుర్తు చేశారు. మంచి చేసేటప్పుడు అపశకునాలు మాట్లాడవద్దన్నారు. దీనికి కౌంటర్‌గా.. పొన్నం ప్రభాకర్‌కు వీటిపై అవగాహన లేదని గంగుల కమలాకర్ అన్నారు. మధ్యలో కల్పించుకున్న మంత్రి శ్రీధర్ బాబు.. గంగుల కామెంట్స్‌పై ఫైర్ అయ్యారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేకపోతే బీఆర్ఎస్ వాళ్లు ఆ విషయం చెప్పాలన్నారు.
మంత్రికి ఏం తెల్వదన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ క్రమంలోనే మాట్లాడిన పొన్నం ప్రభాకర్.. ఆకారం ఎక్కువుంటేనే అవగాహన ఉంటుందనుకోవడం పొరపాటని వ్యాఖ్యానించారు. గంగుల తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించిన గంగుల కమలాకర్.. బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయాలనుకుంటే తాను కూడా చేయగలనన్నారు. కానీ, తాను మాట్లాడితే వివాదం అవుతుందని, సీఎం రేవంత్ సభలో ఉన్నారని, మంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కామెంట్ చేశారు. దీంతో శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన లేదని ఎట్లా అంటారని మండిపడ్డారు. రెండుసార్లు అలా అన్నారని, ఆ వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని చెప్పారు. దీంతో ఆ మాటలు వెనక్కు తీసుకోవాలని స్పీకర్ సూచించినా.. గంగుల తగ్గలేదు. వ్యక్తిగతంగా కామెంట్స్ చేయొద్దని చెప్పాలని స్పీకర్‌ను కోరారు. ఆ అవకాశాన్ని మీరే ఇచ్చారని స్పీకర్ అన్నారు. కాగా, బిల్లు పాసై రిజర్వేషన్లు అమలైతే తాను సంతోషిస్తానని, కానీ, న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలని కోరారు.