విత్తనాల మధ్యలో గంజాయి

విత్తనాల మధ్యలో గంజాయి
  • వైజాగ్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్న రాచకొండ పోలీసులు
  • ఆరుగురు అరెస్ట్.. 200 కిలోల సరుకు, 2 కార్లు సీజ్

ఎల్​బీనగర్, వెలుగు: విత్తనాల మధ్యలో గంజాయిని ఉంచి వైజాగ్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న ఆరుగురిని రాచకొండ ఎస్​వోటీ, చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఎల్​బీనగర్​లోని రాచకొండ కమిషనరేట్ క్యాంప్ ఆఫీసులో సీపీ డీఎస్ చౌహాన్ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన వివేక్ మోహన్(36), గణేవ్ మారుతీరావ్(32), సచిన్ సురేశ్(32), సంతోశ్​బహర్త్(32), సామ్రాట్ సురేంద్ర(40), బిల్ అశోక్(45) ఓ గ్యాంగ్ గా ఏర్పడి ఈజీమనీ కోసం గంజాయిని సప్లయ్ చేయడం మొదలుపెట్టారు. ఏపీలోని వైజాగ్ ఏజెన్సీ ఏరియా సీలేరులో గంజాయిని కిలో రూ.3 వేలకు కొని దాన్ని మహారాష్ట్రకు తరలించి అక్కడ రూ.20 వేలకు అమ్ముతున్నారు.

 ఈ గ్యాంగ్ గురించి తెలుసుకున్న రాచకొండ ఎస్​వోటీ, చౌటుప్పల్ పోలీసులు వీరిపై నిఘాపెట్టారు. మంగళవారం చౌటుప్పల్ పరిధిలోని టోల్ గేట్ వద్ద 2 కార్లను ఆపి తనిఖీ చేశారు. విత్తనాల మధ్యలో గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. 200 కిలోల గంజాయి, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు.  గంజాయిని తరలించే సమయంలో నిందితులు కారు నంబర్​ ప్లేట్​ను మారుస్తున్నారని సీపీ చౌహాన్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని ఆయన చెప్పారు.