ఔటర్ రింగ్ రోడ్డుపై గేట్‌ వే ఆఫ్ హైదరాబాద్.. ఓవైపు ఎకో థీమ్‌ పార్క్‌.. మరోవైపు భారీ ఐకానిక్ టవర్ : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

ఔటర్ రింగ్ రోడ్డుపై గేట్‌ వే ఆఫ్ హైదరాబాద్.. ఓవైపు ఎకో థీమ్‌ పార్క్‌.. మరోవైపు భారీ ఐకానిక్ టవర్ : సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
  •  మధ్యలో ఎలివేటెడ్ గేట్‌ వే నిర్మించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం 
  • ఎయిర్‌‌పోర్టు నుంచి గాంధీ సరోవర్ వెళ్లేలా కనెక్టివిటీ 
  • మూసీ రివర్ ఫ్రంట్ పనులకు రెండు నెలల్లో టెండర్లు పిలవాలని సీఎం ఆదేశాలు 


హైదరాబాద్, వెలుగు: మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులను స్పీడప్ చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రెండు నెలల్లో టెండర్లు పిలిచేందుకు వీలుగా పనుల్లో వేగం పెంచాలన్నారు. ‘‘బహుళ ప్రయోజనాలతో మూసీ రివర్ ఫ్రంట్‌ ప్రాజెక్టు చేపట్టాలి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలికే  విధంగా హిమాయత్ సాగర్ గాంధీ సరోవర్ వద్ద ఓఆర్ఆర్‌‌పై ‘గేట్ వే ఆఫ్ హైదరాబాద్’ నిర్మాణం చేపట్టాలి. ఓఆర్ఆర్‌‌కు ఒకవైపు ఎకో థీమ్ పార్క్ అభివృద్ధి చేసి, మరోవైపు బాపూఘాట్ సైడ్ భారీ ఐకానిక్ టవర్ నిర్మించాలి. ఇందుకు డిజైన్లు రూపొందించాలి. ఎకో థీమ్ పార్క్, ఐకానిక్ టవర్‌‌ను చేరుకునేందుకు ఎలివేటెడ్ గేట్‌ వే నిర్మించి.. గేట్ వే అఫ్ హైదరాబాద్‌గా డిజైన్ చేయాలి” అని సూచించారు. 

ప్రపంచంలోనే ఎత్తయిన టవర్.. 

బాపూఘాట్ చుట్టూ వరల్డ్ క్లాస్ జోన్‌గా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ‘‘హిమాయత్ సాగర్ దగ్గర అప్రోచ్ రోడ్ నుంచి అత్తాపూర్ వైపు వెళ్లేందుకు కొత్త ఫ్లైఓవర్ నిర్మించాలి. ఈ ప్లైఓవర్ గాంధీ సరోవర్ చుట్టూ కనెక్టింగ్ కారిడార్‌‌లా ఉండాలి. ఎయిర్‌‌పోర్ట్ నుంచి నేరుగా గాంధీ సరోవర్‌‌కు చేరుకునేలా ఈ కనెక్టివిటీ ఉండాలి. తాగు, వరద నీటి నిర్వహణకు వీలుగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ ఉండాలి. ఇందుకోసం వివిధ దేశాల్లోని ప్రాజెక్టులను పరిశీలించాలి” అని సూచించారు. 

‘‘ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నీళ్లను మరింత సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించాలి. స్థలం వృథా కాకుండా మూసీ పరీవాహక ప్రాంతం ఇరువైపులా అండర్ గ్రౌండ్‌లో వాటర్ స్టోరేజ్ సంప్‌లు నిర్మించి.. అక్కడి నుంచి నీటి సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేయాలి. గాంధీ సరోవర్‌‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు వాటర్ ఫ్లో స్టడీస్ పక్కాగా చేయాలి” అని ఆదేశించారు.