న్యూఢిల్లీ, వెలుగు: విశాఖపట్టణం కేంద్రంగా కొత్త రైల్వేజోన్ ఏర్పాటు గెజిట్‌ను కేంద్ర రైల్వే బోర్డు అధికారికంగా విడుదల చేసింది. జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని గెజిట్ లో పేర్కొంది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో రాయగడ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటైంది. వాల్తేరు డివిజన్‌ను విభజించి విశాఖపట్టణం, రాయగడ డివిజన్లుగా మార్పు చేసింది.
దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటు చేస్తున్నట్లు గెజిట్ లో కేంద్రం పేర్కొంది. దక్షిణ కోస్తా, ఈస్ట్ కోస్ట్, దక్షిణ మధ్య రైల్వేల పరిధిలో కీలక మార్పులు చేసింది. పాత వాల్తేరు డివిజన్‌లోని విశాఖ నగర పరిసర ప్రాంతాలను ఇకపై విశాఖపట్టణం డివిజన్‌గా మార్చింది. రాయగడ నుంచి కొన్ని సెక్షన్లను విశాఖ డివిజన్‌లో కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఫిబ్రవరిలో కేంద్రం ఈ జోన్ ఏర్పాటుపై ప్రకటన చేసింది.
తర్వాత అది ముందుకు సాగలేదు. చివరికి 2025 జనవరిలో డీపీఆర్ కు ఆమోదం తెలిపి అదే నెలలో జోనల్ కార్యాలయం భవన నిర్మాణానికి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. తాజాగా కీలకమైన గెజిట్ నోటిఫికేషన్ రావడంతో అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ జోన్ కార్యకలాపాలకు కీలక అధికారుల నియామకం ఇప్పటికే పూర్తయింది.
ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారుల నియామకం పూర్తయింది. ఇతర డివిజన్ల నుంచి ఆప్షన్లు కోరగా మూడు వేల మంది విశాఖ జీఎం కార్యాలయం పరిధిలో పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. జీఎం కార్యాలయంలో 1,200 మంది అవసరం, జోన్ అంతటా 17 వేల మంది వరకు పనిచేస్తారు.
సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ మాత్రమే..
రాయగడ కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే కింద పనిచేస్తుందని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఇకపై సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉంటాయని తెలిపింది. ఖుర్దా రోడ్ డివిజన్‌లో గల ‘ఇచ్ఛాపురం నుంచి పలాస’ వరకు గల మార్గాన్ని విశాఖపట్టణం డివిజన్‌కు బదిలీ చేసింది. గుంతకల్ డివిజన్ నుంచి ‘రాయచూర్ - వాడి సెక్షన్’ సికింద్రాబాద్ డివిజన్‌కు బదిలీ అయింది. రాయగడ డివిజన్‌లో ఇంతకు ముందున్న పలాస -ఇచ్ఛాపురం రైల్వే లైన్, ఇచ్చాపురం దువ్వాడ- విజయనగరం రైల్వే లైన్లు విశాఖ డివిజన్ చేరాయి.
