కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో అవినీతికి అడ్డుకట్ట వేసి ప్రజలకు పారదర్శకమైన పాలన అందించేందుకు ‘జెన్-జీ విజిలెన్స్ వాచ్డాగ్’ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు తెలిపారు. శనివారం ఓ హోటల్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు 50 మందితో వాచ్ డాగ్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. యువ లాయర్లు, ఆర్టీఐ కార్యకర్తలు, ఐటీ ప్రొఫెషనల్స్‌తో పాటు ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న యువతను ఈ కమిటీలో ఎంపిక చేస్తామని చెప్పారు. కార్పొరేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇంజనీరింగ్ పనులు, టౌన్ ప్లానింగ్ వ్యవహారాలపై వీరు నిరంతరం పర్యవేక్షిస్తారని చెప్పారు. కరీంనగర్లో 22ఏ నిషేధిత భూముల సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు.
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి సమస్యను వివరించానని, ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారని తెలిపారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, కాంగ్రెస్ కార్పొరేటర్లు గుమ్మడి రాజకుమార్, భాస్కర్ నాయక్, ఆకుల నందిని, విక్రమ్ సికిందర్, శారద బాలరాజు, గంట శ్రీనివాస్, సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
