రామగుండం ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ షట్డౌన్.. పైప్లైన్ల నుంచి స్టీమ్ లీకేజీతో సమస్య

రామగుండం ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ షట్డౌన్.. పైప్లైన్ల నుంచి స్టీమ్ లీకేజీతో సమస్య

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫర్టిలైజర్స్​ అండ్​ కెమికల్స్​ లిమిటెడ్ (ఆర్ఎఫ్​సీఎల్) ప్లాంట్​ను షట్​డౌన్​ చేశారు. ప్లాంట్​లో యూరియా తయారీకి వినియోగించే అమోనియా పైప్​లైన్లలో స్టీమ్​ లీకేజీ కావడంతో యూరియా ఉత్పత్తిని నిలిపి వేయాలని మేనేజ్​మెంట్​ నిర్ణయం తీసుకుంది. 

శనివారం ప్లాంట్​లో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ప్లాంట్​లో పని చేస్తున్న ఆఫీసర్లు, ఉద్యోగులతో పాటు చుట్టు పక్కల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అమోనియా లీక్​ అయిందనే అనుమానంతో ఆఫీసర్లు ప్లాంట్​లో యూరియా ఉత్పత్తి నిలిపివేయగా, టెక్నికల్​ టీమ్​ పరిశీలించి స్టీమ్​ లీకేజీ అయినట్లు గుర్తించారు. 

లీకేజీ అయిన చోట రిపేర్​ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తి కావడానికి వారం నుంచి 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆర్ఎఫ్​సీఎల్​ ప్లాంట్​ నుంచి ప్రతి రోజు 3,850 మెట్రిక్​ టన్నుల యూరియా ఉత్పత్తి చేస్తున్నారు. 

ఇటీవల ఎలాంటి అంతరాయం లేకుండా యూరియాను నిరంతరం ఉత్పత్తి చేసి మార్క్​ఫెడ్​ గోడౌన్లలో అందుబాటులో ఉంచారు. ప్లాంట్​ షట్​డౌన్​ చేసినా యూరియా కొరత ఏర్పడకుండా రైతులకు సప్లై చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు తెలిపారు.

కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల

హైదరాబాద్‌‌: ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ ప్లాంట్‌‌ మరోసారి షట్‌‌డౌన్‌‌ కావడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. వానాకాలం సీజన్‌‌లో యూరియాకు డిమాండ్‌‌ ఎక్కువగా ఉన్న సమయంలో ప్లాంట్‌‌ 10 రోజులపాటు మూతపడడం రాష్ట్ర రైతులకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందన్నారు.

 కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ సెంట్రల్​ మినిస్టర్​ జగత్‌‌ ప్రకాశ్‌‌ నడ్డాకు లెటర్  రాశారు. రాష్ట్రంలో యూరియా అవసరాలను తీర్చడంలో ఆర్‌‌ఎఫ్‌‌సీఎల్‌‌ కీలకమని పేర్కొన్నారు. 2025 వానాకాలం సీజన్‌‌లో ప్లాంట్‌‌ మూడు దఫాలుగా 112 రోజులు ఉత్పత్తి నిలిపివేసిందని తెలిపారు. మరోసారి షట్‌‌డౌన్‌‌ కావడంతో యూరియా సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. 

పది రోజుల కంటే ముందుగా ఉత్పత్తిని పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరారు. యూరియా లోటును పూడ్చేందుకు ఇతర ఫ్యాక్టరీల నుంచి అదనంగా కేటాయించాలని, అవసరమైతే దిగుమతుల ద్వారా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.