ముషీరాబాద్, వెలుగు: రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రతిఘటన ఉద్యమాలు చేపడుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టడం దుర్మార్గమన్నారు. శనివారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో 18 బీసీ సంఘాల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించేందుకే రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని చెప్పారు. జనాభాలో బీసీలు అధికంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం ఇప్పటికీ తక్కువగానే ఉందన్నారు. యువత తమ పోరాట స్ఫూర్తిని నిరుద్యోగం, పేదరికం, సామాజిక వివక్ష, అవినీతిపై పోరాడేందుకు వినియోగించాలని సూచించారు. బీసీ సంఘాల నాయకులు అనంతయ్య, రాజేందర్, వంశీ, సాయిబాబా, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
