ఒకప్పుడు చాలా దీన స్థితిలో ఉన్నవారు.. ఈ రోజు ఎంతో ఎత్తులో ఉంటారు.. గొప్ప గొప్ప పదవుల్లో ఉంటారు. గతంలో అనుభవించిన కష్టాలు.. పడిన బాధలను అస్సలు గుర్తుంచుకోరు.. గతంలో సాయం చేసిన వారిని పట్టించుకోరు.. ఇబ్బంది పెట్టిన వారిని మాత్రం కష్టపెట్టేందుకు సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు. కాని ప్రతి మనిషి జీవితంలో ఎదిగిన తరువాత కూడా కచ్చితంగా కొన్ని విషయాలను గుర్తించుకోవాలి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .!
ప్రతి మనిషి జీవితంలో పైకి ఎదగాలని ప్రయత్నిస్తుంటాడు. కింద పడుతున్నా కొద్దీ పైకి లేస్తాడు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ జీవితంలో ఏదో ఒక అండతో పైకి ఎదుగుతాడు. అది ఒకరి మాట సాయం కావచ్చు.. వారే దగ్గరుండి మిమ్మలను అంత ఎత్తుకు ఎదిగేలా చివరి వరకు వెంట ఉండవచ్చు.. లేదా మరికొంతమంది జనాలను తొక్కుతూ.. అన్యాయంగా ఒకరికి దక్కాల్సిన ఉన్నత స్థితిని మరొకరికి దక్కుతుంది. ఎలా వచ్చినా పదవి.. ఉన్నత స్థితి ఉంటే చాలా గత జీవితాన్ని మర్చిపోతారు చాలామంది. గతంలో పడిన కష్టాలు.. అనుభవించిన పరాభవాలు.. వీటన్నింటిని వదిలేయాలి. కాని వాటిని పదే పదే గుర్తు చేసుకుంటూ.. ఆ అక్కసును ఇతరులపై తీర్చుకుంటారు. కాని అది కాదు జీవితం.. గతంలో వారు పడిన కష్టాలు ఇతరులు పడకుండా.. తనకు చేతనైన సాయం చేయాలి.
ప్రస్తుతం సమాజంలో జనాలు గత విషయాలను ఏమీ గుర్తుంచుకోవడం లేదు. మనిషి పడిపోయినప్పుడు పైకి లేపిన చేతిని మర్చిపోతున్నాడు. కానీ తాను పైకి వచ్చిన తర్వాత తనను కిందికి లాగేవాళ్లను మాత్రం గుర్తుపెట్టుకుంటాడు..ఇదే మనిషి నైజంగా మారిపోయింది. తాను ఎలా పైకి లేచాడు.. దానికి సాయం చేసిన వారిని మాత్రం అస్సలు గుర్తుపెట్టుకోవడం లేదు. అంతేకాదు వారు సాయంకోసం వస్తే అస్సలు గుర్తించడం లేదు. గుడ్డివాడికి చూపు వచ్చిన వెంటనే మొదటగా అతని చేతిలోని కర్రను వదులుతాడు. అప్పటి వరకు దారి చూపిన కర్రపై ఏ మాత్రం విశ్వాశం చూపించడు. కాని అతను అప్పటి వరకు ఉన్న చీకటిని వదిలి వెలుగును చూస్తున్నాడు. ఎందుకంటే చూపు లేనప్పుడు చేతి కర్ర అవసరం ఉన్నప్పుడు దేవుడిలా కనిపిస్తుంది..అవసరం తీరిన తర్వాత అదే ఆధారం భారంగా కనిపిస్తుంది!
నడవలేనప్పుడు భుజం ఇచ్చినవాడు గొప్పవాడు.. నడక వచ్చిన తర్వాత అదే భుజం అడ్డుగా కనిపిస్తుంది. ఆకలితో ఉన్నప్పుడు పెట్టిన ఒక్క ముద్ద అన్నం అమృతంలా ఉంటుంది.. కడుపు నిండిన తర్వాత అదే ముద్దలోనొ లోపాలు వెతకడం మానవ నైజంగా మారిపోయింది. అలాగే కన్నీళ్లు వచ్చినప్పుడు తుడిచిన చేయి దేవుడిలా అనిపిస్తుంది...కళ్ళలో ఆనందం వచ్చిన తర్వాత ఆ చేతి జ్ఞాపకమే మరిచిపోతాం.
ప్రతి మనిషి గుర్తు పెట్టుకోవాల్సినవి
విజయం సాధించామంటే అది ఒక్కరి కష్టం కాదు. దాని వెనుక ఎంతో మంది కష్టం ఉంది. ఎన్నో త్యాగాలు కూడా ఉంటాయి. ఆటలో గెలిచినా.. అత్యున్నత స్థాయికి చేరినా .. ఎంతటి గొప్ప విజయాన్ని సాధించినా .. నీ గెలుపు నీ ఒక్కరి కథ కాదు..నిన్ను నమ్మి.. నీకు సాయం చేసి.. నీకు చేదోడు వాదోడుగా నిలిచి ఎంతో మంది కృషి ఉంటుంది. ఈరోజు నువ్వు కూర్చున్న కుర్చీ నీది కావచ్చు…కానీ ఆ కుర్చీ వరకు నిన్ను తీసుకొచ్చిన మెట్లను మర్చిపోవద్దని పండితులు చెబుతున్నారు.
ఈరోజు నీ పేరు ముందు పెద్ద పదవి ఉండొచ్చు…కానీ ఆ పేరు నిలబడటానికి మొదట అక్షరం నేర్పిన మనిషిని మర్చిపోవద్దు. ఎత్తుకు ఎదిగిన చెట్టు తన వేర్లను మర్చిపోతే…మొదటి గాలి వచ్చినప్పుడు నేలకూలుతుంది అనే విషయాన్ని గుర్తించి మసలుకోవాలి.
అందుకే.. నిన్ను అవమానించినవారిని మర్చిపో..కానీ నిన్ను ఆదుకున్నవారిని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దని చెబుతున్నారు. విజయాన్ని చూసి చప్పట్లు కొట్టేవాళ్లు వందమంది ఉంటారు..కానీ ఓటమిలో కన్నీళ్లు తుడిచిన ఒక్క మనిషి విలువను వెయ్యి విజయాలు ఇచ్చినా కొనలేరని గ్రహించాలి.
కాలం మారుతుంది...పరిస్థితులు మారుతాయి...మనుషులు మారుతారు...కానీ కృతజ్ఞత మాత్రం మారకూడదు.. ఎందుకంటే.. ఎంత ఎత్తుకు ఎదిగినా తల వంచగలిగినవాడే నిజమైన గొప్పవాడు.ఎంత సంపాదించినా పంచగలిగినవాడే నిజమైన ధనవంతుడు.ఎంత దూరం వెళ్లినా తన మొదటి అడుగును గుర్తుపెట్టుకున్నవాడే నిజమైన మనిషి!
ఒకరోజు నీకు అన్నీ ఉండొచ్చు..డబ్బు ఉండొచ్చు.. పేరు ఉండొచ్చు.. అధికారం ఉండొచ్చు.. గౌరవం ఉండొచ్చు.. కానీ ఆ రోజు నీ పక్కన నీ కష్టకాలంలో నిలిచిన మనిషి లేకపోతే..నీ విజయం పూర్తి కాదని తెలుసుకోవాలి. అందుకే పెద్దలు చెప్పినట్టు నిన్ను నడిపించిన చేతిని వదలకు..నిన్ను నిలబెట్టిన భుజాన్ని మర్చిపోకు..నీ కోసం కన్నీరు పెట్టిన కళ్ళను మరచిపోకు..నీ మీద నమ్మకం పెట్టుకున్న హృదయాన్ని దూరం చేయకు!
ఎందుకంటే..ఈరోజు నీకు వెలుగు వచ్చింది కాబట్టి నిన్న నీతో ఉన్న చీకటిని తక్కువగా చూడకు. చీకట్లో నీకు దారి చూపిన చేతికర్రను వెలుగులో పారేయకు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు.ఈరోజు నువ్వు ఇంకొకరికి ఆధారం కావచ్చు..రేపు అదే ఆధారం నీకు అవసరం కావచ్చు!
జీవితంలో ఎదుగు.. కానీ, ఎదుటి వారిని తొక్కి కాదు. గెలువు.. కానీ నిన్ను నడిపించినవారిని మరిచి కాదు. ఎత్తుకు వెళ్లు.. కానీ నీ వేర్లను వదిలి కాదు.నీ విజయం ఎంత పెద్దదైనా..నీ కృతజ్ఞత అంతకంటే పెద్దదిగా ఉండాలి..అదే నిజమైన విజయం..అదే నిజమైన వ్యక్తిత్వం.. అదే మనిషి మంచితనం..!
