
- డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్
ముషీరాబాద్, వెలుగు : దివ్యాంగుల హక్కుల చట్టం 2016ను తెలంగాణ రాష్ట్రంలో పక్కాగా అమలు చేయాలని డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఆదివారం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అన్ని జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రతినిధులతో కలిసి నూతన కమిటీని ఎన్నుకున్నారు.
అనంతరం నూతన రాష్ట్ర అధ్యక్షుడు షేక్ హబీబ్ మియా, ప్రధాన కార్యదర్శి సీహెచ్ లక్ష్మయ్య మాట్లాడుతూ.. 317 జీవో ద్వారా దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 40% అంగవైకల్యం ఉన్న వారికి బదిలీల్లో ప్రాముఖ్యత ఇచ్చి గరిష్ట కనిష్ట సర్వీసుతో నిమిత్తం లేకుండా ప్రస్తుతం పని చేస్తున్న ప్రాంతంలో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లు పక్కాగా అమలయ్యేలా చూడాలని కోరారు. సమావేశంలో నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు రాజ వర్ధన్, బండి నాగేశ్వరరావు, మల్సూర్ నాయక్, మందల ఈదయ్య పాల్గొన్నారు.