హైదరాబాద్ లో సమ్మర్ లో చేపట్టాల్సిన యాక్షన్ ప్లాన్ పై దృష్టి పెట్టింది జీహెచ్ఎంసీ. ఈ క్రమంలో మంగళవారం ( జనవరి 27 ) ఖైరతాబాద్ జలమండలి హెడ్డాఫీసులో సమీక్షా సమావేశం నిర్వహించారు ఎండీ అశోక్ రెడ్డి.ఈ సమావేశంలో వాటర్ సప్లై, సీవరేజ్ పనులు, ఇంకుడు గుంతలు, డీ-సిల్టింగ్, ట్యాంకర్ డెలివరీ అంశాలపై చర్చ జరిగింది. ఈ క్రమంలో కొత్త నల్లా కనెక్షన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. కొత్త కనెక్షన్ల మంజూరులో ఇంకుడు గుంతను తప్పనిసరి చేసేలా రెవెన్యూ నిబంధనల మార్చాలని నిర్ణయించారు.
200 గజాల ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత అవసరమని.. 300 గజాల పైబడిన ప్రాంగణాల్లో ఇంకుడు గుంత తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టాలని అన్నారు. వేసవిలో 24 గంటల్లో ట్యాంకర్ నీటి సరఫరా లక్ష్యమని.. ఇందుకోసం అదనపు ఫిల్లింగ్ స్టేషన్లు, ఫిల్లింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని అన్నారు.అవసరమైతే అదనపు ట్యాంకర్ల సమకూర్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ఎండీ అశోక్ రెడ్డి. ట్యాంకర్ బుక్ చేసిన 24 గంటల్లో నీరు సరఫరా చేయాలని స్పష్టం చేశారు.
మొత్తం 12 సర్కిళ్లకు ఒక్కో సీజీఎంను నోడల్ ఆఫీసర్ గా నియామకం చేపట్టాలని.. రానున్న 90 రోజుల్లో ఓఆర్ఆర్ పరిధిలో 18 వేల ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని అన్నారు. ఒక్కో నోడల్ ఆఫీసర్ 2 వేల ఇంకుడు గుంతల లక్ష్యంతో ప్రణాళిక రూపొందించాలని.. ప్రతిపాదనలు పంపి అనుమతులు పొందాలని ఆదేశాలు జారీ చేశారు.
రానున్న 4 నెలల్లో అన్ని సీవరేజ్ లైన్లు, మ్యాన్ హోళ్ల డీ-సిల్టింగ్ పూర్తి చేయాలని అన్నారు. అదనపు ఖర్చు లేకుండా 90 రోజుల ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని..మే చివరి నాటికి అన్ని డీ-సిల్టింగ్ పనులు పూర్తి చేయాలన్న ఆదేశించారు. 2024 అక్టోబర్ 2 నుంచి నిర్విరామంగా డీ-సిల్టింగ్ పనులు జరుగుతున్నాయని..ఇప్పటివరకు 48,887 ప్రాంతాల్లో పనులు పూర్తయ్యాయని అన్నారు. 6,285 కిలోమీటర్ల సీవరేజ్ పైపులైన్ డీ-సిల్టింగ్ పూర్తయ్యిందని..4.87 లక్షల మ్యాన్ హోళ్లలో పనులు పూర్తయినట్లు తెలిపారు.
