
హైదరాబాద్ సిటీ, వెలుగు : నగరంలో గణనాథుల సామూహిక నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. హుస్సేన్‌సాగర్‌తో పాటు సిటీలోని 20 ప్రధాన చెరువులు, 72 బేబీ పాండ్స్‌లో నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే నిమజ్జనాలు కొనసాగుతుండగా, శనివారం పూర్తి స్థాయిలో గణపయ్యలు గంగమ్మ ఒడికి చేరనున్నారు. ఆదివారం చంద్రగ్రహణం ఉన్న కారణంగా మండప నిర్వాహకులు శనివారం అర్ధరాత్రిలోపు నిమజ్జనాలు పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ట్రాఫిక్, లా అండ్ఆర్డర్ పోలీస్, జీహెచ్ఎంసీ, హెల్త్, వాటర్‌బోర్డు, విద్యుత్, ఆర్టీసీ, మెట్రో ఇతర శాఖల అధికారులు కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించడానికి చర్యలు తీసుకుంటున్నారు.
సొంత వాహనాలు వద్దు : ట్రాఫిక్ సీపీ
సిటీలో ఎక్కడెక్కడ ట్రాఫిక్ఆంక్షలు విధించారు? డైవర్షన్స్ ఎక్కడున్నాయి? పార్కింగ్ ప్లేసెస్ లాంటి వివరాలను శుక్రవారం ఎల్బీ స్టేడియం సమీపంలోని ట్రాఫిక్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన సమావేశంలో ట్రాఫిక్ సీపీ జోయల్‌డేవిస్ వివరించారు. ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర ఉదయం 6 గంట లకు ప్రారంభమవుతుందని, నాలుగో నెంబర్ క్రేన్ వద్ద మధ్యాహ్నం 1:30 లోపు నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. బడా గణేశ్ శోభాయాత్ర జరుగుతున్నప్పుడు ఆ రూట్‌లో వచ్చే ఇతర నిమజ్జన వాహనాలకు ఆపేస్తామ న్నారు. శనివారం ఉ..6 గంటల నుంచి ఆదివారం ఉ..10 గంటల వరకు ప్రధాన శోభాయాత్ర రూట్‌లో విగ్రహాలను తీసు కెళ్లే వాహనాలు తప్ప ఇతర వెహికల్స్‌కు అనుమతి లేదన్నారు. శోభాయాత్ర చూడడానికి వచ్చే వారు సొంత వాహనాలకు బదులు బస్సులు లేదా రైళ్లను ఉపయోగించాలని కోరారు.
10 లక్షల మంది వస్తరు
నిమజ్జనోత్సవంలో 10 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని ట్రాఫిక్ సీపీ చెప్పారు. చిన్న విగ్రహాలను తీసుకొచ్చే భక్తులు బేబీ పాండ్స్‌లో నిమజ్జనం చేయాలని కోరారు. 4 రోజులుగా ప్రైవేట్ బస్సులను సిటీలోకి అనుమతించడం లేదని, ఆర్టీసీ బస్సులకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు వర్తిస్తాయని చెప్పారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా రియల్ టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్స్ అందిస్తామన్నారు. బాలాపూర్గణేశ్21 కిలోమీటర్లు ప్రయాణించి హుస్సేన్సాగర్తీరంలో నిమజ్జనం అవుతాడని, అడ్డంకులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. శనివారం హుస్సేన్‌సాగర్‌లో 20వేల విగ్రహాల నిమజ్జనం జరిగే అవకాశం ఉందని, టస్కర్లో 10 వేలు, ఇతర వాహనాల్లో మరో 10 వేలు వస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. ఇప్పటికే రూట్ ఇన్‌స్పెక్షన్ చేశామన్నారు. ఎయిర్పోర్ట్ వెళ్లే వారు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే లేదా ఔటర్ రింగ్ రోడ్‌ను మాత్రమే ఉపయోగించాలని కోరారు. 3200 మంది ట్రాఫిక్ సిబ్బంది రెండు షిఫ్టుల్లో డ్యూటీలు చేస్తారన్నారు. వాహనాల కదలికలు తెలుసుకోవడానికి రెండు డ్రోన్‌లు,14 హై రైజ్డ్ కెమెరాలను సిద్ధం చేసుకున్నామని చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్
నుంచి విజువల్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి సూచనలు చేస్తామన్నారు.