- జీహెచ్ఎంసీలోని 6 సర్కిల్స్‌లో కూల్చివేతలు
- ఒక్క రోజులోనే 653 ఆక్రమణల తొలగింపు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫుట్‌పాత్ ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ ఉక్కుపాదం మోపుతోంది. ప్రతి శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ దుకాణాలు, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా శనివారం నగరంలోని ఆరు జోన్లలో పోలీసులు, ట్రాఫిక్ పోలీసులతో కలిసి జీహెచ్‌ఎంసీ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ డ్రైవ్‌లో భాగంగా ఒక్కరోజులోనే 653 ఆక్రమణలను తొలగించారు. ఇందులో 165 శాశ్వత కట్టడాలు, 488 తాత్కాలిక నిర్మాణాలు ఉన్నాయి.
నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఫుట్‌పాత్‌లను ఖాళీ చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. డ్రైవ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు టౌన్ ప్లానింగ్, విజిలెన్స్ విభాగాలతో పాటు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేశారు. ఇంజినీరింగ్ విభాగం జేసీబీలు, ఇతర యంత్రాలను అందించగా, శానిటేషన్ విభాగం శిథిలాలను తొలగించింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్, జోనల్ కమిషనర్లు పర్యవేక్షిస్తూ సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు.
శంషాబాద్ జోన్‌లో అధికంగా..
అత్యధికంగా శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్‌పేట మున్సిపల్ ఆఫీస్ ఎక్స్ రోడ్డు నుంచి ఆదిబట్ల వరకు 323 ఆక్రమణలను తొలగించారు. ఇందులో 101 శాశ్వత నిర్మాణాలు ఉన్నాయి. రాజేంద్రనగర్, అత్తాపూర్ పరిధిలో ఆరాంఘర్ నుంచి పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 116 వరకు చేపట్టిన డ్రైవ్‌లో 102 ఆక్రమణలను తొలగించారు. గోల్కొండ, మెహదీపట్నం జోన్లలో మెహదీపట్నం సర్కిల్ ఆఫీస్ నుంచి గుడిమల్కాపూర్, యాదవ్ భవన్ వరకు 124 అక్రమ కట్టడాలను తొలగించారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలో కాచిగూడ జంక్షన్ నుంచి సుల్తాన్ బజార్ మీదుగా ఆంధ్ర బ్యాంక్ సిగ్నల్ వరకు 60 ఆక్రమణలను తొలగించారు. సికింద్రాబాద్ పరిధిలో గాంధీ ఆస్పత్రి నుంచి పద్మారావు నగర్ వరకు 44 తాత్కాలిక ఆక్రమణలను తొలగించారు.
ఆక్రమిస్తే కఠిన చర్యలు..
ఫుట్‌పాత్‌లపై నడిచేందుకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు చేయడం వల్ల పాదచారులు రోడ్లపైకి రావాల్సి వస్తోందని, దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ముందస్తు నోటీసులు లేకుండానే ఆక్రమణలను తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

