- ..గ్రేటర్ వరంగల్ లో ఆక్రమణకు గురైన నాలాలు
- చాలాచోట్ల 30 మీటర్లకు బదులు 10 నుంచి 12 మీటర్ల వెడల్పే
- వరద ముంపు నివారణ కోసం విస్తరణకు ప్లాన్
- ఇప్పటికే డ్రోన్ సర్వే పూర్తి
- త్వరలోనే ఫిజికల్ గా బౌండరీలు ఫిక్స్ చేయనున్న ఆఫీసర్లు
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ నగర వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ట్రై సిటీలో కబ్జాలతో కుచించుకుపోయిన నాలాలను విస్తరించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇటీవల గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) అధికారులు డ్రోన్ సర్వే పూర్తి చేశారు.
ఇందులో తీసిన మ్యాపులను ఇరిగేషన్ రికార్డుల్లో ఉన్న మ్యాపులతో సరిపోల్చి, తొందర్లోనే జీడబ్ల్యూఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లు ఫిజికల్ గా జాయింట్ సర్వే నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. అనంతరం నాలాలకు హద్దులు నిర్ణయించి, రెండు వైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ఆక్రమణలతో కుచించుకుపోయాయి..
గ్రేటర్ వరంగల్ లో వరద ప్రవాహానికి హనుమకొండ వైపు నయీంనగర్ నాలా, వరంగల్ వైపు భద్రకాళి, బొందివాగు నాలాలు ప్రధానమైనవి. ఇందులో మడికొండ, సోమిడి, కాజీపేట, వడ్డేపల్లి, గోపాలపూర్ వైపుల నుంచి వచ్చే వరద వడ్డేపల్లి చెరువు నుంచి నయీంనగర్ నాలా ద్వారా నాగారం చెరువు వైపు వెళ్తుంటాయి. వరంగల్ లో ఖిలా వరంగల్, బెస్తం చెరువు, రంగశాయిపేట, ఉర్సు రంగసముద్రం, భట్టుపల్లి, కడిపికొండ తదితర చెరువుల నీళ్లు బొందివాగు నుంచి భద్రకాళి నాలా ద్వారా నాగారం చెరువులోకి వెళ్లాల్సి ఉంది.
కానీ, ఈ మూడు ప్రధాన నాలాలు చాలాచోట్ల ఆక్రమణకు గురయ్యాయి. క్షేత్రస్థాయిలో 30 మీటర్లు (దాదాపు వంద అడుగులు) ఉండాల్సిన నాలాలకు ఇరువైపులా రెసిడెన్షియల్, కమర్షియల్ బిల్డింగులు వెలిశాయి. 30 ఫీట్ల బఫర్ జోన్ కూడా లేకుండా ఆక్రమణకు గురయ్యాయి. ఫలితంగా 30 మీటర్ల వరకు ఉండాల్సిన నాలాలు చాలాచోట్లా 10 నుంచి 12 మీటర్ల వెడల్పు మాత్రమే ఉన్నాయి.
హనుమకొండలోని నయీంనగర్ నాలా వడ్డేపల్లి, వెంకటేశ్వరకాలనీ, జవహర్ కాలనీ, పరిమళ కాలనీ తదితర చోట్ల కుచించుకుపోయింది. అటు బొందివాగు కూడా ఆక్రమణలతో వంకరటింకరగా మారిపోయి. కొన్నిచోట్ల 10 మీటర్లకే పరిమితమైంది. భద్రకాళి నాలా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దీంతో భారీ వర్షాలు పడినప్పుడల్లా నాలాలు ఉప్పొంగి వరద కాలనీల్లోకి పరుగులు తీసి, జనాలు ఇండ్లను వదిలి పునరావాస కేంద్రాల్లో పూట గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
చేతులెత్తేసిన గత సర్కార్..
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో 2016, 2020 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు వరంగల్ నగరం నీట మునిగింది. అప్పటి మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతిరాథోడ్, స్థానిక ఎమ్మెల్యేలు ముంపు ప్రాంతాలను పరిశీలించారు. వెంటనే నాలాలపై ఆక్రమణలు తొలగించి, వాటి విస్తరణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
క్షేత్రస్థాయి సర్వే చేపట్టిన గ్రేటర్ వరంగల్ అధికారులు ప్రధాన నాలాలపై 400కుపైగా నిర్మాణాలున్నట్లు గుర్తించారు. అందులో కొంతమంది కోర్టుకు వెళ్లగా, మరికొంతమందికి అప్పటి లీడర్లే సపోర్ట్ చేసి ఆక్రమణల తొలగింపుపై చేతులెత్తేశారనే ఆరోపణలున్నాయి.
తొందర్లోనే ఫిజికల్ సర్వే..
గ్రేటర్ వరంగల్ నగరంలో నాలాల ఆక్రమణల సమస్య తీవ్రంగా ఉండటంతో ఏటా వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నయీంనగర్ నాలాను కొంతమేర డెవలప్ చేశారు. ప్రెసిడెన్సీ స్కూల్ నుంచి కాకతీయ కెనాల్ యూటీ వరకు సర్వే చేయించారు.
ఆ పరిధిలో నయీంనగర్ నాలా 12 మీటర్లే ఉండటంతో చుట్టూ ఆక్రమణలు తొలగించి 25 మీటర్లకు విస్తరించారు. ఇప్పుడు వడ్డేపల్లి చెరువు నుంచి ప్రెసిడెన్సీ స్కూల్ వరకు కూడా నాలాను విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు బెంగళూరుకు చెందిన 'శుభ్' కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో ఇటీవల వరంగల్ నగరంలోని నయీంనగర్ నాలా, బొందివాగు నాలా, భద్రకాళి నాలాల డ్రోన్ సర్వే పూర్తి చేసి ఆక్రమణలున్నట్లు గుర్తించారు.
డ్రోన్ సర్వే మ్యాప్ ల తో ఇరిగేషన్ మ్యాపులను సూపర్ ఇంపోజ్ చేసి నాలాల స్థితిగతులను తేల్చే పనిలో పడ్డారు. ఆ మేరకు శుభ్ కన్సల్టెన్సీ, గ్రేటర్ ఇంజినీరింగ్ అధికారులకు కసరత్తు చేస్తున్నారు. ఆ తర్వాత రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఫిజికల్ సర్వే నిర్వహించి ఎన్ని ఇండ్లు ఎఫెక్ట్ అవుతున్నాయో తేల్చి బౌండరీలు ఏర్పాటు చేయనున్నారు.
దాదాపు రూ.800 కోట్లతో అభివృద్ధి
ఫిజికల్ సర్వే తర్వాత నాలాల విస్తరణకు గ్రేటర్ అధికారులు మార్కింగ్ చేయనున్నారు. నాలాలపై ఉన్న ఆక్రమణలు తొలగించడంతో పాటు అర్హులైన వారికి పునరావాసం కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. బాధితులకు పరిహారం, నాలాల విస్తరణ, ఇరువైపులా రిటైనింగ్ వాల్స్, అవసరమైన చోట్ల బ్రిడ్జిలు, కల్వర్టులు నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఈ పనులన్నీ పూర్తి చేసేందుకు దాదాపు రూ.800 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే శుభ్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో గ్రేటర్ సిటీలోని నాలాలను డెవలప్ చేసి, నగరానికి ముంపు ముప్పు తప్పించేలా చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు నాలాల విస్తరణకు డీపీఆర్ రెడీ అవుతోందని, ఆయా పనులకు ఆమోదం లభించిన తర్వాత పనులు మొదలవుతాయని గ్రేటర్ ఆఫీసర్లు చెబుతున్నారు.

