పోస్టల్ బ్యాలెట్ పై  అవగాహన కల్పించాలి : రోనాల్డ్ రాస్ 

పోస్టల్ బ్యాలెట్ పై  అవగాహన కల్పించాలి : రోనాల్డ్ రాస్ 
  • జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ 

హైదరాబాద్, వెలుగు : లోక్ సభ ఎన్నికల డ్యూటీల్లో పాల్గొనేవారు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఆదేశించారు. బుధవారం బల్దియా హెడ్డాఫీసులో హైదరాబాద్, సికింద్రాబాద్ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల  డ్యూటీలు నిర్వహించే పోలింగ్, ఇతర సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అందించడం, బ్యాలెట్ ప్రక్రియ, నిబంధనలు, ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు, తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు.

ఎన్నికల డ్యూటీలు చేసే ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పకడ్బందీగా ఉండాలని, అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. మొదటి విడత శిక్షణలో ఫారం – 12 అందించి, పోస్టల్ బ్యాలెట్ పై పూర్తి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్, సికింద్రాబాద్ రిటర్నింగ్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్, బల్దియా ఎన్నికల అడిషనల్ కమిషనర్ అలివేలు మంగతాయారు, ఏఆర్ఓలు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

ఓటీఎస్ ను వినియోగించుకోండి : బల్దియా కమిషనర్ 

వన్ టైమ్ సర్వీస్ (ఓటీఎస్​) ద్వారా కూకట్ పల్లి ఐడీపీఎల్ కంపెనీ బకాయి ఉన్న రూ.16 కోట్ల చెక్కుని బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ కు కంపెనీ ప్రతినిధులు బుధవారం అందజేశారు. ఓటీఎస్ ద్వారా ఐడీపీఎల్ సంస్థ బకాయిలు చెల్లించినందుకు కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు. మిగతా ప్రభుత్వ కంపెనీలు, ఆఫీసులు, ఆస్తిపన్ను బకాయిదారులు ఓటీఎస్​ ద్వారా బకాయిలు

ఈ నెలాఖరు లోపు  చెల్లించి వడ్డీ పై 90 శాతం రాయితీ పొందవచ్చని సూచించారు. 2023–-24  ఏడాది ఇంటి పన్ను బకాయిలను కూడా చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఐడీపీఎల్ కంపెనీ ప్రతినిధులు, అడిషనల్ కమిషనర్లు జయరాజ్ కెనెడీ, గీత రాధిక, వాల్యుయేషన్ ఆఫీసర్ మహేశ్​ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.