హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు మరోసారి ఆందోళన బాట పట్టారు. పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కుత్బుల్లాపూర్, గాజులరామారం, ఖైరతాబాద్ సర్కిల్ కార్యాలయాల ముందు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. బిల్లులు వెంటనే ఇవ్వాలని గోడలకు పోస్టర్లు అతికించారు. ఎంతో కష్టపడి పనులు చేసినా జీహెచ్ఎంసీ నుంచి నెలల తరబడి బిల్లులు రావడంలేదని కాంట్రాక్టర్లు ఆరోపించారు. ఇప్పటికే రూ.1,200 కోట్లు బకాయిలు ఉన్నట్లు తెలిపారు. మంగళవారం కూడా అన్ని సర్కిల్ ఆఫీసుల వద్ద ఆందోళన చేపడతామన్నారు. ఆ తర్వాత జోనల్ ఆఫీసుల వద్ద, చివరగా హెడ్ ఆఫీసు దగ్గర ఆందోళన నిర్వహిస్తామని కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సురేందర్ సింగ్ తెలిపారు. అలాగే, ఆందోళనకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. బిల్లులు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ను రిక్వెస్ట్ చేశారు.
