నవంబర్ 25న బల్దియా కౌన్సిల్ మీట్.. 25 ప్రశ్నలపై చర్చించే అవకాశం

నవంబర్ 25న  బల్దియా కౌన్సిల్ మీట్.. 25 ప్రశ్నలపై చర్చించే అవకాశం

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మంగళవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులోని కౌన్సిల్ హాల్ లో జరగనుంది. ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి సభ్యుల నుంచి 95  ప్రశ్నలు రాగా, 20 ప్రశ్నలపై  చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుత కౌన్సిల్​కు ఈ సమావేశం చివరి జనరల్ బాడీ సమావేశం అయ్యే అవకాశముంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రస్తుత కౌన్సిల్ పదవీకాలం ముగియనుంది. అంతలోపు  జనవరిలో బడ్జెట్ సమావేశం జరగనుంది.

 ఈ కౌన్సిల్ ఏర్పడినప్పటి నుంచి చేసిన అభివృద్ధి పనులపై సభలో చర్చ జరిగే అవకాశముంది.  కౌన్సిల్ లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ఆయా పార్టీ ఆఫీసుల్లో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. ఆయా పార్టీల రాష్ట్రస్థాయి నేతలు వీరికి దిశా నిర్దేశం చేశారు.  ఐదేండ్లలో ఏం పనులు చేశారో చెప్పాలని డిమాండ్ తో పాటు డివిజన్లలో ఉన్న సమస్యలను లేవనేత్తేందుకు ఇరు పార్టీ  కార్పొరేటర్లు సిద్ధం అయ్యారు.  అలాగే సభ్యులందరికి సభలో  మాట్లాడేందుకు మేయర్  అవకాశం ఇవ్వాలని సభ్యులకో కోరుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న ప్రశ్నలపై మాత్రమే చర్చించకుండా ప్రతి సభ్యుడు అడిగిన ప్రశ్నలపై  చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు.  

టీ బ్రేక్​లో ఫొటో సెషన్

ప్రస్తుత కౌన్సిల్ పదవీకాలం ముగియనుండడంతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్ లో  ప్రస్తుత సభ్యులతో  ఫొటో సెషల్ ఉండనుంది. జనరల్ బాడీ మీటింగ్​లో టీ బ్రేక్ సమయంలో మేయర్, సభ్యులందరితో కలిసి  గ్రూప్ ఫొటో దిగనున్నారు.  వచ్చే బడ్జెట్  సమావేశంలో సభ్యులందరికి ఈ ఫొటోను అందించనున్నారు.