
- మొన్నటి వరదలతో కోతకు గురైన పాత వంతెన
- ఇప్పటికే ఓవైపు నిర్మాణంలో ఉన్న కొత్త బ్రిడ్జి
- ఆ పనులు మార్చిలోగా పూర్తి చేయాలని డెడ్ లైన్
- అప్పటివరకు రాకపోకలు బంద్
- మరోవైపు బ్రిడ్జిని జూన్‌లోగా పూర్తి చేసేలా ప్లాన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: అంబర్‌పేట, దిల్సుఖ్నగర్ ప్రాంతాలను కలిపే మూసారాంబాగ్ పాత బ్రిడ్జి ప్రస్థానం ఇక ముగిసినట్టే. ఇక్కడ ఇప్పటికే ఓవైపు కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండగా, పాత బ్రిడ్జి ఇటీవల వచ్చిన భారీ వరదలకు కోతకు గురైంది. దీంతో పటిష్టను పరిశీలించిన జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు ఈ బ్రిడ్జికి రిపేర్లు కాకుండా దీని స్థానంలో కొత్తది నిర్మిస్తేనే మంచిదని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో ఈ పనులను కూడా త్వరగా ప్రారంభించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులను కూడా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చిలోపు కొత్త బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని, అప్పటివరకు రాకపోకలు పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించారు. అలాగే ప్రస్తుతం కోతకు గురైన బ్రిడ్జి పనులను కూడా వెంటనే ప్రారంభించి జూన్ లోగా పూర్తి చేయాలని అధికారులు డెడ్ లైన్ పెట్టుకున్నట్లు తెలిసింది.
ఎప్పుడో పూర్తి కావాల్సింది కానీ..
మూసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడో జరగాల్సి ఉండగా, 2020లో వరదల వస్తే గానీ గత ప్రభుత్వం మేలుకోలేదు. అప్పడే ఈ నిర్మాణాలకు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల గేట్లు ఎత్తిన సమయంలో మాత్రమే వీటి ప్రస్తావన వచ్చేది. ఆ తరువాత నిర్మాణాల విషయాన్ని పట్టించుకోలేదు. మళ్లీ 2022 జులైలో జంట జలాశయాల గేట్లు ఎత్తిన సమయంలో మూసారాంబాగ్ బ్రిడ్జి బంద్ చేశారు.
మరోసారి ఇబ్బందులు లేకుండా రూ.54 కోట్లతో బ్రిడ్జి నిర్మించనున్నట్లు, అందుకు సంబంధించిన పనులు 10 రోజుల్లోనే ప్రారంభిస్తామని అప్పటి మంత్రులు చెప్పినప్పటికీ పనులు మాత్రం మొదలు పెట్టలేదు. బ్రిడ్జి నిర్మాణ టెండర్లు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తి అయినప్పటికీ.. పనులు మాత్రం చేయలేదు.
అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పనులు ముందుకుసాగలేదు. ఈ క్రమంలో గతేడాది నిర్మాణ పనులు స్టార్ట్ అయినప్పటికీ నిర్మాణ పనులు అలాగే ఉన్నాయి. మొన్నటి వరదలతో ఈ పనులను వెంటనే పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ పనులు పూర్తయితే వరదలు వచ్చిన సమయంలో వాహనదారులకు ఇబ్బందులు ఉండవని అధికారులు
చెప్తున్నారు.