ఫుట్​ఓవర్​బ్రిడ్జిలు కట్టకుండా డివైడర్లు పెంచుతున్న బల్దియా

ఫుట్​ఓవర్​బ్రిడ్జిలు  కట్టకుండా డివైడర్లు పెంచుతున్న బల్దియా

హైదరాబాద్, వెలుగు: యాక్సిడెంట్లు పెరుగుతున్నాయని బల్దియా అధికారులు గ్రేటర్​ రోడ్లపై డివైడర్లను పెంచుతున్నారు. ప్రస్తుతం ఉన్నవాటి స్థానంలో 3 అడుగుల ఎత్తులో కొత్తవాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ఏర్పాటు పూర్తయింది. మిగిలిన చోట్ల పనులు కొనసాగుతున్నాయి. మెయిన్​రోడ్లపై ఎక్కడపడితే అక్కడ జనం రోడ్లు దాటకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఆలోచన మంచిగానే ఉన్నా సరిపడా ఫుట్​ఓవర్​బ్రిడ్జి(ఎఫ్ఓబీ)లు నిర్మించకుండా రోడ్లను క్లోజ్​చేస్తే తాము ఎలా దాటాలని పాదచారులు ప్రశ్నిస్తున్నారు. కొన్నిచోట్ల డివైడర్లను పూర్తిగా క్లోజ్​చేయకుండా అక్కడడక్కడ గ్యాప్​ఇస్తుండడంతో చాలా మంది అందులో గుండా దాటుతున్నారు. వెహికల్స్​స్పీడుగా వచ్చినప్పుడు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. జీబ్రా క్రాసింగ్​కిలోమీటర్ల దూరంలో ఉంటుండడంతో వృద్ధులు, స్టూడెంట్లు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. డివైడర్లను పెంచుతున్న రూట్లలోని రద్దీ ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తే ఈ సమస్య ఉండదని జనం అభిప్రాయపడుతున్నారు. బల్దియా అధికారులు గతంలో గ్రేటర్​వ్యాప్తంగా మొత్తం100 ఎఫ్ఓబీలు నిర్మిస్తామని చెప్పినప్పటికీ, ఫస్ట్​ఫేజ్​కింద 52 చోట్ల ఏర్పాటు చేయాలని ప్లాన్​చేశారు. గతేడాది మార్చి లోపే 37 ఎఫ్‌‌ఓబీలు అందుబాటులోకి వస్తాయని చెప్పినా ఇప్పటిరకు కేవలం 
8 మాత్రమే పూర్తయ్యాయి. 

ప్రధాన సర్కిళ్లలోనూ ఇంతే..

ఫస్ట్​ఫేజ్​లో భాగంగా ముందు 37 ఎఫ్ఓబీలను నిర్మించాలని ప్రతిపాదించినప్పటికీ 22చోట్ల మాత్రమే పనులు మొదలుపెట్టారు. వీటిలో కేవలం 8 మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన చోట్ల పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా కనిపించడంలేదు. మరో వైపు డివైడర్ల ఎత్తు పెంచుతుండడంతో జనం వాటిని ఎక్కి రోడ్లు దాటుతున్నారు. స్పీడుగా వెళ్తున్న వెహికల్స్​కు ఒక్కసారిగా పాదచారులు అడ్డువస్తుండడంతో కొన్నిచోట్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మెహిదీపట్నం నుంచి మాసబ్ ట్యాంక్ వెళ్లే రోడ్డులోని డివైడర్ల ఎత్తు పెంచారేగానీ అవసరం ఉన్నచోట ఫుట్ ఓవర్ బ్రిడ్జి మాత్రం కట్టలేదు. సరోజిని దేవి హాస్పిటల్​వద్ద బ్రిడ్జి నిర్మిస్తే డైలీ నాలుగైదు వేల మందికి ఉపయోగపడుతుంది.  పంజాగుట్టలోని నిమ్స్​హాస్పిటల్ వద్ద కూడా ఇదే పరిస్థితి. రోజంతా రద్దీగా ఉండే అమీర్ పేటలో ఎఫ్ఓబీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. లంగర్ హౌజ్​లోనూ ఎఫ్ఓబీ కట్టకుండా డివైడర్ల ఎత్తు పెంచుతున్నారు.

పూర్తయింది ఇవే..

రూ.75.65 కోట్ల అంచనాతో బల్దియా 22 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల పనులు ప్రారంభించగా, ఇప్పటివరకు మదీనాగూడలోని చెన్నై షాపింగ్ మాల్, మియాపూర్ లోని యశోద పియరల్ కాంప్లెక్స్, పంజాగుట్టలోని హైదరాబాద్ సెంట్రల్ మాల్, బాలానగర్ లోని ఎన్ఎస్ కేకే స్కూల్ దగ్గర, నేరెడ్​మెట్ బస్టాప్, సికింద్రాబాద్ లోని సెయింట్ ఆన్స్ స్కూల్, రాజేంద్రనగర్ లోని స్వప్న థియేటర్, ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద నిర్మించిన 8 బ్రిడ్జిలు జనానికి అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన చోట్ల పూర్తిచేస్తే యాక్సిడెంట్లు తగ్గే అవకాశం ఉంది.

అవసరాన్ని గుర్తించట్లేదు

అధికారులు గుర్తించిన చోట బ్రిడ్జిల నిర్మాణాలను ఆలస్యం చేస్తున్నారు. కొత్తగా అవసరమైన ప్రాంతాలను గుర్తించడం లేదు. దీంతో రోడ్డు దాటే సమయంలో  పాదచారులు యాక్సిడెంట్లకు గురవుతూనే ఉన్నారు. ముఖ్యంగా రోడ్ల వెంట నడుస్తున్న టైంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎఫ్ఓబీలు లేకపోవడంతోపాటు ఫుట్​పాత్​లు ఆక్రమణకు గురికావడమే ఇందుకు కారణం. కిలో మీటర్ల దూరంలో జీబ్రా క్రాసింగులు ఉంటున్నాయి. గతేడాది మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో150 మందికిపైగా పాదచారులు రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. అయినప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోడవడం లేదు.