అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన లక్ష్యం : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన లక్ష్యం : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
  •     గ్రేటర్​ మేయర్​ గద్వాల్  విజయలక్ష్మి

రామచంద్రాపురం, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని జీహెచ్ఎంసీ మేయర్​ గద్వాల్​ విజయలక్ష్మి తెలిపారు. బుధవారం శేరిలింగంపల్లి జోన్​​పరిధిలోని రామచంద్రాపురం డివిజన్​లో పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. రూ.40.70 కోట్లతో కమ్యూనిటీ హాల్స్, సీసీ రోడ్లు, యూజీడీ, బాల విహార్, థీమ్​ పార్కులు, రాయసముద్రం చెరువు సుందరీకరణ, మీట్  మార్కెట్ తదితర అభివృద్ధి పనులకు డిప్యూటీ మేయర్​ మోతె శ్రీలతతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదేళ్లుగా అందరి సమన్వయంతో బల్దియాను అభివృద్ధి పథంలో నడిపామని తెలిపారు. గ్రేటర్  పరిధిలోని కాలనీల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక కృషి చేశామని, పార్టీలకతీతంగా జీహెచ్ఎంసీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కలిసి రావడం సంతోషకరమన్నారు. ఆర్సీపురం కార్పొరేటర్  పుష్ప నగేశ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, భారతీనగర్ కార్పొరేటర్  సింధూ ఆదర్శ్​రెడ్డి, కురుమ సంఘం నాయకుడు బూరుగడ్డ నగేశ్​ యాదవ్, వెన్నవరం మల్లారెడ్డి, ప్రమోద్ గౌడ్, రాకేశ్​రాజ్, కుమార్​ యాదవ్​ పాల్గొన్నారు. 

ఇరువర్గాల మధ్య ఘర్షణ.. 

ఆర్సీపురంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయ స్థలం విషయంలో రెండు వర్గాలు మేయర్​ ముందే బాహాబాహీకి దిగారు. దీంతో అక్కడ కొద్దిసేవు ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. సంబంధిత స్థలం ఆలయానికి చెందిందని ఓ వర్గం చెబుతుండగా, ఆ స్థలం ఓ కుల సంఘానికి కేటాయించారని మరో వర్గం వాదించడంతో గొడవ మొదలైంది.

రెండు వర్గాల వారు మేయర్​కు సమస్య వివరిస్తుండగా ఘర్షణ జరగడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదే సమయంలో పీహెచ్​సీ ఎదురుగా ఉన్న కల్లు కాంపౌండ్​ను వెంటనే అక్కడి నుంచి తీసివేయాలని కాలనీవాసులు ధర్నా నిర్వహించారు. కల్లు కాంపౌండ్​ ముందు బైఠాయించి నినాదాలు చేశారు. కాలనీ మధ్యలో కల్లు కాంపౌండ్​ ఉండడంతో ఇబ్బంది పడుతున్నామని వాపోయారు.