మహా నిమజ్జనానికి ముమ్మర ఏర్పాట్లు

మహా నిమజ్జనానికి ముమ్మర ఏర్పాట్లు
  • మరో 74 కృత్రిమ నిమజ్జన పాయింట్లు కూడా.. 
  • 134 స్టాటిక్ ,269 మొబైల్ క్రేన్లు సిద్ధం చేస్తున్న బల్దియా  
  • హుస్సేన్​సాగర్​ వద్ద 9 బోట్లు, 16 డీఆర్ఎఫ్​ టీమ్స్ 
  • అందుబాటులో 200 మంది గజ ఈతగాళ్లు 

హైదరాబాద్ సిటీ, వెలుగు: గణేశ్ నిమజ్జనాల కోసం జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా హుస్సేన్ సాగర్, సరూర్‌‌‌‌ నగర్ చెరువు, ఐడీఎల్ చెరువు, సఫిల్ గూడ చెరువు, సున్నం చెరువుతో సహా మొత్తం 20 పెద్ద చెరువుల్లో నిమజ్జనం నిర్వహించనున్నారు. వీటితో పాటు ఆరడుగుల లోపు విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు 74 కృత్రిమ నిమజ్జన పాయింట్లు సిద్ధం చేస్తోంది. ఇందులో 27 బేబీ పాండ్స్, 23 ఎక్సవెటెడ్ పాండ్స్, 23 పోర్టబుల్ ట్యాంక్స్ ఉన్నాయి. 

ఈ పాండ్స్ ద్వారా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను చెరువుల్లో వేయకుండా చూడడంతో పాటు ప్రధాన చెరువుల వద్ద నిమజ్జనం ప్రక్రియ తొందరగా పూర్తి చేయవచ్చని  అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నిమజ్జనాలు మొదలుకావడంతో భారీ విగ్రహాల కోసం క్రేన్స్ అందుబాటులో  ఉంచారు. వచ్చే నెల 6న అన్ని విగ్రహాల నిమజ్జనం జరగనున్నది. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ విగ్రహాలు ఉన్నాయని గ్రహించిన అధికారులు దానికి తగ్గట్లు  ఏర్పాట్లు చేస్తున్నారు. చెరువుల వద్ద లైటింగ్, క్రేన్లు, మొబైల్ టాయిలెట్స్, శానిటేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. 56,187 ఫోకస్ లైట్స్ ఏర్పాటు చేస్తున్నారు. 

160 గణేశ్ యాక్షన్ టీమ్స్

20 పెద్ద చెరువులతో పాటు 74 ఆర్టిఫిషియల్​పాండ్స్​వద్ద నిమజ్జనం కోసం134 స్టాటిక్ క్రేన్లు, 269 మొబైల్ క్రేన్లు ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ వద్ద తొమ్మిది బోట్స్, 16 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్, 200మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 303 కిలోమీటర్ల మేర గణేశ్​శోభాయాత్ర జరగనుండడంతో ఆయా ప్రాంతాల్లో 160 గణేశ్ యాక్షన్ టీమ్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. పోలీసులతో కలిసి 13 చోట్ల కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి నిమజ్జన ప్రక్రియ మానిటరింగ్ చేయనున్నారు.

 14,500 మంది శానిటేషన్ వర్కర్లు మూడు షిఫ్టుల్లో పని చేయనున్నారు.  గణేశ్​మండపాల వద్ద చెత్త సేకరణకు నగరవ్యాప్తంగా 5 లక్షల ట్రాష్ బ్యాగులను పంపిణీ చేస్తున్నారు. ఆయా మండపాలు, నిమజ్జనం చేసే చెరువులు, పాండ్స్ వద్ద నుంచి చెత్త సేకరణకు 2 వేలమంది సిబ్బంది రౌండ్ ది క్లాక్ విధులు నిర్వర్తించనున్నారు. నిమజ్జనం చివరి రోజున చెత్త తొలగింపునకు 102 మినీ టిప్పర్లు, 125 జేసీబీలను వినియోగించనున్నారు. నిమజ్జన ప్రాంతాల్లో  309 మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయనున్నారు.  

10,269 గుంతల పూడ్చివేత

నిమజ్జన ప్రాంతాల్లో క్రేన్ ఆపరేటర్లు, సహాయక సిబ్బందికి టెంపరరీ రెస్ట్ రూమ్స్ తో పాటు భోజన ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో రోడ్ల రిపేర్లు చేసి గుంతలు పూడుస్తున్నారు. ఇప్పటివరకు నగర వ్యాప్తంగా 10 వేల 269 గుంతలను పూడ్చినట్లు జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్​అధికారులు చెప్పారు. నిమజ్జనాలు జరిగే చెరువులు, పాండ్స్ వద్ద కుక్కలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో కుక్కల నియంత్రణ వాహనాలను ఏర్పాటు చేసి కుక్కలు కనిపిస్తే తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేశారు. 

నిమజ్జనానికి తరలివచ్చే భక్తుల కోసం ట్యాంక్‌‌‌‌ బండ్‌‌‌‌, సరూర్‌‌‌‌ నగర్‌‌‌‌ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ తరఫున మంచినీళ్లు, ఉచితంగా భోజనం కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఏడు మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు సిద్ధం చేశారు. నిమజ్జనానికి జోనల్ కమిషనర్లతో పాటు పోలీస్‌‌‌‌ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు.