ఈసారి రూ. 10 వేల కోట్ల మార్క్ దాటనున్న GHMC బడ్జెట్.. !

ఈసారి రూ. 10 వేల కోట్ల మార్క్ దాటనున్న GHMC బడ్జెట్.. !

హైదరాబాద్ సిటీ, వెలుగు: వచ్చే ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్​పై బల్దియా ఫోకస్ పెట్టింది. గతేడాది కంటే ఈసారి బడ్జెట్ అంచనాలు రూ. 1500– -2000 కోట్ల వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  జీహెచ్ఎంసీ చట్టం-1955 సెక్షన్ 182 ప్రకారం వార్షిక బడ్జెట్ అంచనాల నివేదికను ఏటా నవంబర్ 10లోపు స్టాండింగ్ కమిటీ సమావేశం ముందు ప్రవేశపెట్టాలి. ఈ నెల 21న జరగనున్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం ముందుకు 2026–-27 వార్షిక బడ్జెట్ అంచనాలతో కూడిన నివేదిక ప్రవేశపెట్టేందుకు కమిషనర్ ఆర్వీ కర్ణన్ సిద్ధమవుతున్నారు. 

ఇప్పటికే ప్రధాన విభాగాల ఉన్నతాధికారులకు ప్రతిపాదనలను పంపించాలని ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో జోనల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లు, చీఫ్ ఇంజనీర్లు, సిటీ ప్లానర్లు, ఎస్ఈలు వార్షిక బడ్జెట్ ఆదాయ వ్యయాల ప్రతిపాదనలను సిద్ధం చేయడంపై చర్చలు సాగిస్తున్నారు. డిప్యూటీ కమిషనర్ల నుంచి సానుకూలంగా స్పందన వస్తున్నందున బడ్జెట్ అంచనాలు పెరుగుతాయనేదానికి నిదర్శనమని అధికారులు చర్చించుకుంటున్నారు. 2026–-27 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాలు రూ. 10 వేల కోట్ల మార్కును దాటే అవకాశాలు ఉన్నాయి. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెవెన్యూ రిసిప్ట్స్ రూ.4,445 కోట్లుగా ఉంటే.. వచ్చే ఏడాది రూ. 5,550 కోట్లుగా ఉండొచ్చని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూ.4000 కోట్లుగా ప్రస్తుతముంటే.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో క్యాపిటల్ వ్యయం రూ.5500 కోట్లుగా పెరుగుతుందని అంచనా. 2024–-25లో బడ్జెట్ అంచనాలు రూ. 7,937 కోట్లుగా ఉంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు రూ.8,440 కోట్లుగా ప్రతిపాదించారు. ఈ రెండు బడ్జెట్ల వ్యత్యాసం రూ.503 కోట్లుగానే ఉంది. అయితే, వచ్చే వార్షిక బడ్జెట్ అంచనాలు రూ.11,000 కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశాలున్నట్లు ఎక్స్ పర్ట్స్ అభిప్రాయపడుతున్నరు. 

ఎన్నికల కోడ్​తో ఆలస్యం!

చట్టం ప్రకారం నవంబర్ 10 లోపు వార్షిక బడ్జెట్ అంచనా నివేదికను స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రవేశపెట్టాలి. కానీ, ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ సమావేశం ఈ నెల 21న నిర్వహించి అందులో బడ్జెట్ అంచనాలు ప్రతిపాదించనున్నారు. స్టాండింగ్ కమిటీ సవరింపులు, సవరింపుల అంచనాల ప్రతిపాదనలను డిసెంబర్ 10వ తేదీలోపు ఆమోదం పొందాల్సి ఉంది. 

ఈ ఆమోదం పొందిన వార్షిక బడ్జెట్ అంచనాల ప్రతిపాదనల బుక్లెట్స్ ప్రతి కార్నొరేటర్ కు డిసెంబర్ 15 లోపు అందజేయాల్సి ఉంది. డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 20 లోపు జీహెచ్ఎంసీ ఆమోదించాల్సి ఉంది. అనంతరం సమాచారం నిమిత్తం మార్చి 1 లోపు ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంది.