హైదరాబాద్, వెలుగు: ఎన్నికల డ్యూటీ చేసేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది జంకుతున్నారు. ఎంతో కష్టపడి ఎలక్షన్ విధులు నిర్వహించినా గౌరవ వేతనం అందకపోవడంతో సిబ్బంది ఆసక్తి చూపడంలేదు. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల డ్యూటీలో పనిచేసిన వారితో పాటు గతేడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బూత్ లెవల్ ఆఫీసర్గా డ్యూటీ చేసిన సిబ్బంది బిల్లులు నేటికీ పెండింగ్ లోనే ఉన్నాయి. దాదాపు 2 వేల మందికి గౌరవ వేతనాలు అందలేదు. ఇక పాత డబ్బులే పెండింగ్లో ఉండటంతో ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ డ్యూటీలు చేసేందుకు వెనుకాడుతున్నారు. ఎన్నికల సమయంలో ఎంతో కష్టపడి పనిచేసినా కూడా గౌరవ వేతనాలు ఇవ్వలేదని, ఇలాగైతే ఎలా పనిచేయాలని ప్రశ్నిస్తున్నారు.
ఒక్కొక్కరికి రూ.7 వేలు పెండింగ్
జీహెచ్ఎంసీ బిల్లుల నుంచి మొదలుకొని జీతాలు, గౌరవ వేతనాలు కూడా చెల్లించడంలేదు. బల్దియా రోజురోజుకు ఆర్థికంగా ఢీలా పడుతుండటంతో 10వ తేదీ వచ్చినా కూడా ఉద్యోగులకు జీతాలు అందడంలేదు. కాంట్రాక్టర్లకు ఎప్పుడు చూసినా భారీ స్థాయిలో బిల్లులు పెండింగ్ లోనే ఉంటున్నాయి. ఎలక్షన్ డ్యూటీలు చేసిన వారికి ఎట్టి పరిస్థితుల్లో బిల్లులు, వేతనాలు పెండింగ్ ఉంచకుండా చెల్లించాలి. కానీ బల్దియాలో మాత్రం అలా జరగడం లేదు. రెండేళ్ల నుంచి గౌరవ వేతనాలు అందించలేదు. ఒక్కొక్కరికి రూ.7 వేల చొప్పున మొత్తం దాదాపు కోటికిపైగా పెండింగ్ లో ఉన్నాయి.
కొన్ని సర్కిళ్లలో ఇచ్చినా కూడా..
గ్రేటర్ లో ఉన్న 30 సర్కిళ్లలోని కొన్నింటిల్లో ఎలక్షన్ డ్యూటీ చేసిన సిబ్బందికి గౌరవ వేతనాలు అందాయి. మూడు, నాలుగు సర్కిళ్లలో వెంటనే ఇచ్చినప్పటికీ.. మిగతా చోట్ల ఇవ్వలేదు. జీహెచ్ఎంసీ బాధ్యతలు అంతటా ఒకే విధంగా ఉండాల్సినప్పటికీ ఎవరికి నచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారు. ఎన్నికల డ్యూటీ చేయించిన సంబంధిత సర్కిల్ అధికారులు వెంటనే వారికి డబ్బులు ఇవ్వాల్సి ఉండగా ఏళ్లు గడిచినా ఇవ్వడంలేదు.
ఇప్పటికైనా తమకు రావాల్సిన గౌరవ వేతనాలు ఇవ్వాలని సిబ్బంది కోరుతున్నారు. రాత్రి పగళ్లు పనిచేసిన కూడా డబ్బులు ఇవ్వకపోతే ఎలా అని అంటున్నారు. ఇదే అంశంపై గతంలో పలువురు జీహెచ్ఎంసీ కమిషనర్ ను సైతం కలిశారు. పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనాలను వెంటనే ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు.
