- ఐఐటీ ఖరగ్‌పూర్, ఢిల్లీ ఎయిమ్స్‌తో ఒప్పందం
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో సరఫరా అవుతున్న నీటి నాణ్యతను పర్యవేక్షించేందుకు, కలుషిత నీటి వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలను ఏఐ ఆధారిత టెక్నాలజీతో ముందే పసిగట్టేందుకు జీహెచ్‌ఎంసీ నడుం బిగించింది. ఐఐటీ ఖరగ్‌పూర్, ఢిల్లీ ఎయిమ్స్‌తో కలిసి ‘వాటర్ క్వాలిటీ మానిటరింగ్’ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నది. ఇందులో భాగంగా గురువారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ఎంఎఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సమక్షంలో ఒప్పందం జరిగింది.
సెప్టెంబర్ తర్వాత ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానున్నది. ప్రస్తుతం నీటి శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపితే ఫలితాలు రావడానికి రోజులు పడుతోంది. కొత్త విధానంలో ‘నాన్-థర్మల్ ప్లాస్మా స్పెక్ట్రోస్కోపీ’, ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ టెక్నాలజీ ఉపయోగిస్తారు. ఇది నీటిలోని భారీ లోహాలు (మెటల్స్), కెమికల్స్, సూక్ష్మజీవులతో పాటు ఇతర కాలుష్య కారకాలను కూడా గుర్తిస్తుంది.
12 నెలల పాటు పైలట్ ప్రాజెక్టు
12 నెలల పాటు పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టనున్నారు. ఏడాదిలో హైదరాబాద్అంతా కలిపి 25 వేల నీటి శ్యాంపిల్స్ సేకరించి పరీక్షించనున్నారు. కెమికల్, మైక్రోబయోలాజికల్ పారామీటర్లకు సంబంధించి సుమారు 19 లక్షల డేటా పాయింట్లను విశ్లేషించనున్నారు.
ఈ తాగునీటి నిఘా కేంద్రం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్ లోని కొనసాగుతున్న ఎంఎస్ యూ నుంచి పనిచేయనుంది. ఐఐటీ ఖరగ్‌పూర్ లోని స్కూల్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ నిపుణులు ఈ ప్రాజెక్టుకు మార్గదర్శకత్వం వహించనున్నారు. ఐఐటీ మద్రాస్ పరిశోధకులు కూడా ఈ సాంకేతికత అభివృద్ధిలో పాలుపంచుకోనున్నారు.
దేశానికే దిక్సూచిగా మారుతుంది: జయేష్ రంజన్
ఒప్పందం తర్వాత జయేష్ రంజన్ మాట్లాడుతూ ‘తెలంగాణను టెక్నాలజీ హబ్‌గా మార్చడమే కాకుండా, సాంకేతికతను ప్రజారోగ్యం కోసం వాడడంలో మనం ముందున్నాం. ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో దేశానికే దిక్సూచిగా మారుతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుమన్ చక్రవర్తి మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడం తమకు గర్వకారణమన్నారు.
సాంప్రదాయ పద్ధతుల కంటే ఇది వెయ్యి రెట్లు ఎక్కువ ఖచ్చితత్వంతో పనిచేస్తుందని, కేవలం సెకన్ల వ్యవధిలోనే ఫలితాలను విశ్లేషించి, కాలుష్యం ఏదైనా ఉంటే వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తుందని వివరించారు.
