అస్తవ్యస్తంగా మిర్యాలగూడ మున్సిపల్రికార్డులు.. ఏసీబీ తనిఖీతో సంచలన విషయాలు వెలుగులోకి

అస్తవ్యస్తంగా మిర్యాలగూడ మున్సిపల్రికార్డులు.. ఏసీబీ తనిఖీతో సంచలన విషయాలు వెలుగులోకి

మిర్యాలగూడ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఏసీబీ అధికారుల దాడిలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. మున్సిపాలిటీలో రికార్డుల నిర్వహణ సరిగా చేయకుండా, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందడంతో ఏసీబీ ఆఫీసర్లు గురువారం దాడి చేసి రికార్డులను పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలో నెలకు రూ. 19.33 లక్షల విలువైన ఇంధనం వాడుతున్నట్లు రికార్డుల్లో చూపుతూ అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. 

అలాగే ఏడాదికి పన్ను అంచనా రూ.24 కోట్లు ఉండగా కేవలం రూ. 9.17 కోట్లు మాత్రమే వసూలు చేశారని, షాపుల పన్నుల్లో సైతం భారీ మొత్తంలో బకాయిలు ఉన్నట్లు ఏసీబీ ఆఫీసర్లు గుర్తించారు. మిర్యాలగూడలోని మొత్తం 1,783 షాపుల ద్వారా రూ. 36.18 లక్షల ఆదాయం రావాల్సి ఉండగా.. కేవలం రూ. 15.01 లక్షలు మాత్రమే వసూలు చేసినట్లు తేలింది. టౌన్ ప్లానింగ్‌ ఆఫీసర్లు 34 బిల్డింగులకు అనుమతులు ఇచ్చినట్లు రికార్డుల్లో చూపినా.. అప్లికేషన్లు మాత్రం 18 ఉన్నాయి. 

రికార్డుల నిర్వహణలో, బిల్డింగ్‌ పర్మిషన్, లేఅవుట్, రిజిస్టర్లు, సిబ్బంది హాజరు పట్టికలు వంటి ఏ రికార్డులు కూడా సరిగా లేవని ఏసీబీ ఆఫీసర్లు గుర్తించారు. అకౌంట్స్‌ విభాగం మొత్తం అస్తవ్యస్తంగా ఉందని, ఎక్కడా పూర్తి స్థాయిలో అకౌంట్స్‌ మెయింటెన్‌ చేయలేదన్నారు. మిర్యాలగూడ మున్సిపల్‌ ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీ మొత్తంలో నష్టం వాటిల్లుతోందని, అధికారుల బాధ్యతారహిత్యం వంటి అంశాలపై ప్రభుత్వానికి రిపోర్ట్‌ అందజేస్తామని ఏసీబీ ఆఫీసర్లు చెప్పారు. కాగా, ఏసీబీ ఆఫీసర్ల రాకను గుర్తించిన చీఫ్ ఇంజినీర్‌ ఎవరి పర్మిషన్‌ లేకుండానే ఆఫీస్‌ నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది.