
మద్యాహ్నం. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
ముల్లన్‌పూర్: సొంతగడ్డపై వన్డే వరల్డ్ కప్ ముంగిట ఇండియా విమెన్స్ టీమ్ చివరి సన్నాహకానికి రెడీ అయింది. మెగా టోర్నీకి డ్రెస్ రిహార్సల్‌గా భావిస్తున్న మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టుకు ఈ సిరీస్ ఎంతో ముఖ్యం.
వరల్డ్ కప్‌కు ముందు జట్టు కూర్పును సరిచూసుకోవడంతో పాటు, గతేడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియా టూర్‌లో 0–-3 ఎదురైన వైట్‌వాష్ ఓటమికి బదులు తీర్చుకునేందుకు అమ్మాయిలకు ఇదో గోల్డెన్ చాన్స్. ఆ ఓటమి తర్వాత ఇండియా అద్భుతంగా పుంజుకుంది. స్వదేశంలో ఐర్లాండ్‌ను 3-–0తో ఓడించి, శ్రీలంకలో సౌతాఫ్రికాతో కలిసి ఆడిన ట్రై సిరీస్‌ను కూడా గెలుచుకుంది. ఆ తర్వాత ఇంగ్లండ్ టూర్‌లో వన్డే (2–1తో), టీ20 (3–2తో) సిరీస్‌ల్లో విజయం సాధించింది. అదే జోరును కొనసాగిస్తూ కంగారూల పని పట్టి.. వరల్డ్ కప్ ముంగిట కాన్ఫిడెన్స్ మరింత పెంచుకోవాలని చూస్తోంది.
రేణుకా సింగ్ రీఎంట్రీ
దాదాపు తొమ్మిది నెలల విరామం తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్న పేసర్ రేణుకా సింగ్‌పై ఈ సిరీస్‌లో అందరి ఫోకస్ ఉంది. ఫ్రాక్చర్ కారణంగా ఆటకు దూరమైన రేణుక ఈ సిరీస్‌లో ఇండియా పేస్ విభాగాన్ని ముందుండి నడిపించనుంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన క్రాంతి గౌడ్, హైదరాబాదీ అరుంధతి రెడ్డి ఆమెకు సహకారం అందిస్తారు.
స్పిన్ విభాగంలో శ్రీలంక సిరీస్‌లో రాణించిన స్నేహ్ రాణా, తెలుగమ్మాయి శ్రీ చరణితో పాటు సీనియర్లు దీప్తి శర్మ, రాధా యాదవ్ బాధ్యత తీసుకోనున్నారు. బ్యాటింగ్‌లో స్మృతి మంధానతో కలిసి ప్రతీకా రావల్ ఓపెనర్‌గా కొనసాగనుంది. షెఫాలీ వర్మ స్థానంలో రావల్ టీమ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. హర్లీన్ డియోల్ వన్‌డౌన్‌లో నిలకడగా రాణిస్తుండగా, మిడిలార్డర్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్ అనుభవం జట్టుకు బలం చేకూర్చనుంది.
ఆత్మవిశ్వాసంలో ఆస్ట్రేలియా
రికార్డు స్థాయిలో ఏడుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా ఫిబ్రవరిలో యాషెస్ తర్వాత తమ తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడనుంది. అయినప్పటికీ తమ జట్టు కూర్పుపై కెప్టెన్ తాలియా మెక్‌గ్రాత్ పూర్తి ధీమాతో ఉంది. ఇండియాపై గత వన్డేలలో అద్భుతంగా రాణించిన కీపర్-బ్యాటర్ బెత్ మూనీ మరోసారి ఆసీస్ టాపార్డర్‌లో ప్రధానం కానుంది. బౌలింగ్‌లో సీనియర్ పేసర్ మేగాన్ షట్‌పై భారీ అంచనాలున్నాయి. మోకాలి సర్జరీ నుంచి కోలుకుంటున్న లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ మోలినెక్స్‌ను వరల్డ్ కప్ దృష్ట్యా ఆసీస్ ఈ సిరీస్‌కు దూరంగా ఉంచే అవకాశం ఉంది.