30 ఇరిగేషన్​ ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు ఇవ్వండి : ఏపీకి కృష్ణా బోర్డు ఆదేశం

30 ఇరిగేషన్​ ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు ఇవ్వండి : ఏపీకి కృష్ణా బోర్డు ఆదేశం

ఏపీ ఇరిగేషన్‌‌ ఈఎన్సీ నారాయణరెడ్డికి లెటర్
తెలంగాణ ఈఎన్సీ ఫిర్యాదుతో స్పందించిన బోర్డు

హైదరాబాద్‌‌, వెలుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చేపట్టిన 30 ప్రాజెక్టుల పూర్తి వివరాలు, డీపీఆర్‌‌లు ఇవ్వాలని కృష్ణా రివర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ బోర్డు (కేఆర్‌‌ఎంబీ) ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. శుక్రవారం ఏపీ ఇరిగేషన్‌‌ ఈఎన్సీ నారాయణరెడ్డికి బోర్డు మెంబర్‌‌ హరికేశ్‌‌ మీనా లెటర్ రాశారు. ఏపీ ప్రభుత్వం ఆయా ప్రాజెక్టులకు అడ్మినిస్ట్రేటివ్‌‌ శాంక్షన్‌‌ ఇచ్చిన తేదీ, జారీ చేసిన జీవోలు, ఇతర అన్ని వివరాలతో కేఆర్‌‌ఎంబీ మెంబర్‌‌ సెక్రటరీ డీఎం రాయ్‌‌పురేకు తెలంగాణ ఇరిగేషన్‌‌ ఈఎన్సీ మురళీధర్‌‌ ఈ మధ్య ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన బోర్డు.. ఆయా ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు వెంటనే కృష్ణా బోర్డుకు అందజేయాలని స్పష్టం చేసింది.

అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టులు

ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తోందని తెలంగాణ ఈఎన్సీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రతిపాదించిన ప్రాజెక్టుల కెపాసిటీని పెంచిందని, స్కోప్‌‌ మార్చిందని చెప్పారు. కొన్ని ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, కొన్నింటిని పూర్తి చేశారని వివరించారు. 29 ప్రాజెక్టులకు రూ.47,776 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్‌‌ శాంక్షన్‌‌ ఇచ్చారని, రూ.67 వేల కోట్లతో పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా, పెన్నా బేసిన్లను లింక్‌‌ చేసే కొత్త ప్రాజెక్టు నిర్మించబోతున్నట్టుగా అసెంబ్లీలో ప్రకటించారని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచేందుకు అవసరమైన ప్రక్రియ మొత్తం పూర్తి చేశారన్నారు.

పోతిరెడ్డిపాడు కేంద్రంగానే 13 ప్రాజెక్టులు

శ్రీశైలం నీటిని రాయలసీమకు మళ్లించేందుకు ఏపీ ఏకంగా 13 అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఈఎన్సీ తెలిపారు. వీటిలో నాలుగు ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచుతుండగా, 9 ప్రాజెక్టులు కొత్తగా నిర్మిస్తున్నారని వివరించారు. శ్రీశైలం నీటిని ఇతర మార్గాల్లో మళ్లించేందుకు ఇంకో నాలుగు కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తోందని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో మరో 11 ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం చేపడుతోంది. వీటి డీపీఆర్‌‌లు ఇచ్చి సంబంధిత రివర్‌‌ బోర్డుతో పాటు సీడబ్ల్యూసీ టెక్నికల్‌‌ అప్రైజల్‌‌, అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ అనుమతి తీసుకోవాలని ఏపీకి కృష్ణా బోర్డు సూచించింది.

పోలవరం నుంచి 4.32 టీఎంసీల మళ్లింపు

పోలవరం కుడి కాలువ కెపాసిటీని 50 వేల క్యూసెక్కులకు పెంచి రోజుకు 4.32 టీఎంసీల నీటిని కృష్ణా, పెన్నా బేసిన్లకు తరలించే స్కీం టెండర్లకు ఏపీ సిద్ధమైంది. ఈ ప్రాజెక్టును చేపట్టబోతున్నట్టు 2020 జూన్‌‌ 16న ఏపీ గవర్నర్‌‌ అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.67 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. రాయలసీమ డ్రాట్‌‌ మిటిగేషన్‌‌ స్కీంలో భాగంగా కేంద్ర సాయం కోరడంతోపాటు కార్పొరేషన్‌‌ ఏర్పాటు చేసి రుణ సమీకరణ కోసం ప్రయత్నిస్తున్నారు.