వారంలో డీఎస్సీ నోటిఫికేషన్​ ఇయ్యాలె : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

వారంలో డీఎస్సీ నోటిఫికేషన్​ ఇయ్యాలె : కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: తొమ్మిదేండ్లలో నిరుద్యోగులను సీఎం కేసీఆర్ నిండా ముంచేశారని కాంగ్రెస్​ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి మండిపడ్డారు. టీచర్​ పోస్టుల విషయంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. వేల సంఖ్యలో టీచర్​ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు. వారం రోజుల్లోగా డీఎస్సీ నోటిఫికేషన్​ ప్రకటించాలని, లేదంటే లక్ష మందితో ప్రగతి భవన్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు. 

ఈ మేరకు మంగళవారం ఆయన సీఎం కేసీఆర్​కు బహిరంగ లేఖ రాశారు. టెట్​ రాసిన అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్​ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రిటైర్​ అవుతున్న టీచర్ల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా.. వారి స్థానంలో కొత్తోళ్లను తీసుకోవాలన్న సోయి కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందని విమర్శించారు. డీఎస్సీ కోసం ఏండ్ల తరబడి అభ్యర్థులు ఎదురు చూస్తున్నారని, వారిలో ఏజ్​ దాటి పోతున్నోళ్లున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో రోజుకో ఆర్భాటం చేసిన ప్రభుత్వం.. నిరుద్యోగుల సమస్యల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. 

2020 డిసెంబర్​లో అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్​ టీచర్​ పోస్టుల భర్తీపై ప్రకటన చేశారని వెంకట్​రెడ్డి గుర్తు చేశారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్​ హయాంలో ఆరు నెలలకోసారి టెట్​, రెండేండ్లకోసారి డీఎస్సీ నోటిఫికేషన్లను ఇచ్చామన్నారు. కానీ, బీఆర్ఎస్​ హయాంలో బీఈడీ, డీఈడీ అభ్యర్థులు ధర్నాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.