ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వండి: గవర్నర్‎కు విజయ్ లేఖ

ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వండి: గవర్నర్‎కు విజయ్ లేఖ

చెన్నై: తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు చకచక అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన టీవీకే చీఫ్ విజయ్ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌కు మంగళవారం (మే 5) లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. రెండు వారాల్లో సభలో మెజారిటీ నిరూపిస్తామని.. ఇందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. గవర్నర్ కార్యాలయం లోక్ భవన్‌కు ఈమెయిల్ ద్వారా లేఖ పంపినట్లు సమాచారం.

‘‘108 మంది శాసనసభ్యులతో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు మాకు ఉంది. మెజారిటీ నిరూపించుకోవడానికి మాకు అవకాశం ఇవ్వాలి. 15 రోజుల్లోగా ఆ సంఖ్యాబలాన్ని నిరూపించుకుంటాం’’ అని విజయ్ లేఖలో పేర్కొన్నారు.  గవర్నర్ త్వరలో విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి.. మెజారిటీ నిరూపించుకోవడానికి 7 నుంచి 15 రోజుల సమయం ఇవ్వవచ్చని లోక్‌ భవన్‌ వర్గాలు తెలిపాయి.

మంగళవారం (మే 5) సాయంత్రం పనైయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో టీవీకే శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో టీవీకే ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నాయకుడిగా విజయ్‎ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. 

కాగా, తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ చరిత్ర తిరగరాసింది. దాదాపు 70 ఏళ్లుగా తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్న ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలను మట్టికరిపించి అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. 108 స్థానాల్లో విజయఢంకా మోగించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్లు అవసరం. 

విజయ్ పార్టీ 108 స్థానాలు మాత్రమే సాధించడంతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 10 సీట్లు అనివార్యం. దీంతో విజయ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. పొత్తులపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. టీవీకే సీనియర్ నేతలు రంగంలోకి కాంగ్రెస్‎తో పాటు ఇతర చిన్న పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.