టీమిండియాకు ఆడటానికి నాకు 3 నెలలు చాలు: గంగూలీ

టీమిండియాకు ఆడటానికి నాకు 3 నెలలు చాలు: గంగూలీ

న్యూఢిల్లీ: టీమిండియా తరఫున తిరిగి టెస్టుల్లో ఆడటానికి తనకు మూడు నెలల ట్రెయినింగ్ సమయం సరిపోతుందని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. తనకు కొంత టైమ్ ఇస్తే టెస్టుల్లో టీమిండియా తరఫున రన్స్ చేయడానికి ఫిట్‌గా తయారవుతానని గంగూలీ చెప్పాడు. చివరగా 2008లో గంగూలీ ఇండియాకు ఆడాడు. 2011లో దాదా ఆఖరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. సంగ్‌బద్ ప్రతిదిన్ అనే బెంగాలీ న్యూస్ పేపర్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ తన కెరీర్ చివరి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు.

‘ఒకవేళ అప్పట్లో మరో రెండు వన్డే సిరీస్‌లు ఆడనిస్తే నేను మరిన్ని రన్స్ చేసేవాణ్ని. నేను నాగ్‌పూర్‌‌లో రిటైర్ అవ్వకపోయుంటే తదుపరి రెండు టెస్టు సిరీస్‌ల్లోనూ బాగా స్కోర్స్ చేసేవాణ్ని. అంతెందుకు ఇప్పుడు కూడా నాకు ఆరు నెలల ట్రెయినింగ్, అలాగే మూడు రంజీ మ్యాచ్‌ల్లో నన్ను ఆడనిస్తే.. మళ్లీ టెస్ట్‌ల్లో టీమిండియా తరఫున రన్స్ చేస్తా. నాకు ఆరు నెలల సమయం కూడా అవసరం లేదు. మూడు నెలలు చాలు. నేను మళ్లీ పరుగులు చేస్తా. మీరు నాకు ఆడే అవకాశం ఇవ్వకపోవచ్చు. కానీ నాలో ఉన్న ఆడగలననే నమ్మకాన్ని మీరు తొలగించగలరా?’ అని దాదా చెప్పాడు.