గ్లోబల్ సమిట్‌‌‌‌‌‌‌‌తో  ప్రపంచస్థాయి పెట్టుబడులు : మంత్రి శ్రీధర్ బాబు

గ్లోబల్ సమిట్‌‌‌‌‌‌‌‌తో  ప్రపంచస్థాయి పెట్టుబడులు : మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించి, కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే మా ప్రభుత్వ సంకల్పమని, ఇందుకు గ్లోబల్ సమిట్‌‌‌‌‌‌‌‌ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటామని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. "తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్-2026"ను రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ఈ సమిట్ ఏర్పాట్లు, రోడ్ షోలు, ఎంవోయూలు, ఇతర అంశాలపై ఆబిడ్స్‌‌‌‌‌‌‌‌లోని ఇండస్ట్రీస్ డైరెక్టర్ కార్యాలయంలో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను మరింత బలోపేతం చేసేలా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌‌‌‌‌‌‌‌లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌‌‌‌‌‌‌‌గా నిలిచేలా పలు పాలసీలను ఆవిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌‌‌‌‌‌‌‌ను విశ్వవ్యాప్తం చేసేలా దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృత ప్రచారం కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. సమిట్ వేదికగా పారిశ్రామికవేత్తలకు మెరుగైన అవగాహన కల్పిస్తామని, కుదిరిన ఎంవోయూలు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకుంటామని చెప్పారు. ప్రతి ఎంవోయూపై పకడ్బందీగా ఫాలో అప్ ఉంటుందన్నారు.

భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. విదేశీ డెలిగేట్లు, పారిశ్రామిక దిగ్గజాలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లాజిస్టిక్స్, ప్రొటోకాల్, హాస్పిటాలిటీ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని వెల్లడించారు. శాఖల మధ్య సమన్వయం లోపించకుండా ప్రతి శాఖకు స్పష్టమైన బాధ్యతలు, టైమ్‌‌‌‌‌‌‌‌లైన్లు నిర్దేశించి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.