సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి  నిధుల్లో గోల్​మాల్

సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి  నిధుల్లో గోల్​మాల్
  • తెప్పోత్సవం పేరిట  రూ15లక్షలు..
  • లైటింగ్​ పేరుతో రూ.3 లక్షలు మాయం 
  • భక్తులు కానుకల  ఆభరణాల లెక్కల్లోనూ తేడా..
  • కొనసాగుతున్న స్పెషల్​కమిటీ విచారణ

సికింద్రాబాద్, వెలుగు: లష్కర్​ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి నిధుల్లో గోల్​మాల్ జరిగినట్టు విచారణ కమిటీ తేల్చింది. అమ్మవారి తెప్పోత్సవం పేరిట  రూ.15లక్షలు, ఉత్సవాల లైటింగ్ కు రూ.3 లక్షలకు తప్పుడు లెక్కలు చూపినట్టు గుర్తించారు. మొత్తం రూ.18లక్షల నిధులకు ఎలాంటి  రశీదులు లేవని, అవినీతి జరిగినట్లు విచారణ అధికారులు ధృవీకరించినట్టు తెలిసింది.  ఆలయంలో నిధుల మాయం వ్యవహారంపై ఎండోమెంట్​ఉన్నతాధికారులకు కొంతకాలం కిందట కంప్లయింట్​ వెళ్లింది. దీంతో విచారణకు ఒక కమిటీని నియమించారు.  గత గురువారం నుంచి కమిటీ విచారణ  కొనసాగిస్తుండగా ఆలయ నిధులతో పాటు అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలు కూడా మాయమైనట్లు తేలింది. 
పాత, కొత్త రికార్డుల మధ్య చాలా తేడాలు

భక్తులు సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలు కూడా మాయమైనట్లు,  2011 సంవత్సరం నుంచి జరుగుతున్నట్లుగా తెలంగాణ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగిళ్ల శ్రీనివాస్​ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ అధికారులు పాత , కొత్త రికార్డులను పరిశీలిస్తుండగా వాటి మధ్య చాలా తేడాలు ఉంటున్నాయి. అమ్మవారికి చెందిన రెండు కిలోల 32 గ్రాముల పైచిలుకు బంగారు నగలు, మరో నాలుగు కిలోల బరువు కలిగిన 76 వెండి వస్తువులను రికార్డుల్లో నమోదై ఉంది. అయితే విచారణ కొనసాగుతుండగానే అప్పటి ఆలయ ఈఓ ఓ వ్యక్తి ద్వారా బయటి నుంచి మూడు కిలోల 800 గ్రాముల బరువు కలిగిన వెండి వస్తువులు పంపగా అప్పటికప్పుడు ఆలయంలో పెట్టినట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా ఎండోమెంట్​నిధులను సెల్ఫ్​ చెక్కులతో కూడా డ్రా చేసినట్లు తేలింది.  అవినీతి వాస్తవమేనని, ఏ మేరకు జరిగిందనేది ఇంకా కొన్ని రికార్డులను పరిశీలించాకే తేలుతుందని విచారణ అధికారులు చెప్పారు. దీనిపై ఆలయ ఈఓ మనోహర్​రెడ్డిని వివరణ కోరగా ఇంకా విచారణ కొనసాగుతుందని, మరికొన్ని రికార్డులు పరిశీలిస్తున్నట్లు, అవి పూర్తయ్యాకే వాస్తవాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు.