గోదావరిఖని, వెలుగు: సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం చేసి, ఆపై బెదిరింపులకు పాల్పడిన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యైటింక్లయిన్ కాలనీకి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి రేపాల సురేందర్‌కు మూడేండ్ల జైలు శిక్ష విధిస్తూ గోదావరిఖని ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ వెంకట సచిన్‌రెడ్డి సోమవారం తీర్పు చెప్పారు. 2016లో యైటింక్లయిన్ కాలనీకి చెందిన దాడి లక్ష్మయ్య కొడుకు మధుకర్‌కు సింగరేణిలో ఉద్యోగం పెట్టిస్తానని నమ్మబలికి సురేందర్ రూ.11 లక్షలు తీసుకున్నాడు.
ఆ తర్వాత ఉద్యోగం పెట్టించకపోగా, సురేందర్ తప్పించుకొని తిరిగాడు. ఉద్యోగం ఇప్పించకపోవడంతో, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని లక్ష్మయ్య, కుటుంబ సభ్యులు నిలదీయడంతో సురేందర్ వారిని బెదిరించాడు. దీంతో బాధితులు గోదావరిఖని టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. అప్పటి ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. కోర్టులో సాక్షులను ప్రవేశ పెట్టడంతో నేరం రుజువైంది. దీంతో సురేందర్‌కు మూడేండ్ల జైలు, రూ. 4 వేల జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పు చెప్పారు.

