గోల్డ్ ఆల్ టైమ్‌ రికార్డ్‌

గోల్డ్ ఆల్ టైమ్‌ రికార్డ్‌
  •     10 గ్రాముల ధర రూ.69,870

హైదరాబాద్‌‌, వెలుగు :  బంగారం ధరలు మళ్లీ కొత్త గరిష్టాలను టచ్ చేశాయి. హైదరాబాద్‌‌లో 10 గ్రాములు గోల్డ్ రేటు (24 క్యారెట్లు) బుధవారం రూ.760 పెరిగి రూ.69,870 కి చేరుకుంది. 22 క్యారెట్లు బంగారం రూ. 64,100 టచ్ చేసింది. కేజీ సిల్వర్‌‌‌‌ రేటు రూ.84,000 పలుకుతోంది. అదే దేశ రాజధానిలో గోల్డ్ రేటు బుధవారం రూ.830 పెరిగి రూ.69,200 లెవెల్‌‌ను టచ్‌‌ చేసింది.  గ్లోబల్‌‌గా రేట్లు పెరుగుతుండడంతో మన దగ్గర గోల్డ్‌‌ చుక్కలనంటుతోందని హెచ్‌‌డీఎఫ్‌‌సీ సెక్యూరిటీస్ ప్రకటించింది. పసిడి  ఈ వారంలో రెండోసారి ఆల్‌‌ టైమ్‌‌ హైని టచ్ చేసింది.

కిందటి సెషన్‌‌లో 10 గ్రాములు గోల్డ్‌‌ రేటు న్యూఢిల్లీలో రూ.68,370 దగ్గర సెటిలయ్యింది. కేజి వెండి ధర రూ. 79 వేల నుంచి రూ.1,700‌‌‌‌ పెరిగి రూ.80,700 కు చేరుకుంది.   గ్లోబల్ మార్కెట్‌‌లో ఔన్స్ (సుమారు 28 గ్రాములు) గోల్డ్‌‌ ధర 2,275 డాలర్ల దగ్గర, సిల్వర్ 26.25 డాలర్ల దగ్గర  ట్రేడవుతున్నాయి. ‘బంగారం  మరోసారి ఆల్‌‌ టైమ్ హైని టచ్ చేసింది. గ్లోబల్ మార్కెట్‌‌లో 2,300 డాలర్లకు (ఔన్స్‌‌) చేరుకుంది. ఎంసీఎక్స్‌‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ హై అయిన రూ.69,500 దగ్గర ట్రేడవుతున్నాయి.  మిడిల్ ఈస్ట్‌‌లో టెన్షన్స్‌‌ పెరుగుతుండడంతో బంగారం డిమాండ్ పుంజుకుంది.

దీంతో పాటు ఫెడ్ ఎప్పుడు వడ్డీ రేట్లను తగ్గిస్తుందో క్లారిటీ లేదు. తాజాగా విడుదలైన యూఎస్ ఎకానమీ డేటా మెరుగ్గా ఉండడంతో కూడా బులియన్ రేట్లు దూసుకుపోతున్నాయి’ అని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌ వైస్ ప్రెసిడెంట్‌‌ ప్రణవ్‌‌ మెర్ అన్నారు.